: ప్రేయసి కోసం ఆమె భర్తను కొత్త స్టయిల్ లో చంపించిన జిమ్ ట్రైనర్... అడ్డంగా దొరికిపోయిన వైనం!

తన ప్రియురాలిని ఎలాగైనా దక్కించుకోవాలన్న కోరికతో ఓ జిమ్ ట్రైనర్ మాస్టర్ ప్లాన్ వేసి, గూఢచార స్టయిల్ లో ఆమె భర్తను హత్య చేయించినప్పటికీ, అడ్డంగా దొరికిపోయాడు. సెకండ్ వరల్డ్ వార్ సమయంలో జరిగిన హత్యల తరహాలో ప్రియురాలి భర్తను విషపు ఇంజక్షన్ ఇవ్వడం ద్వారా చంపించాలని ప్లాన్ వేసి, ఓ కిల్లర్ తో డీల్ కుదుర్చుకున్నాడు. అతన్ని చంపించడంలో విజయం సాధించిన ఈ జిమ్ ట్రైనర్, పోలీసులకు మాత్రం దొరక్కుండా తప్పించుకోలేకపోయాడు. ఢిల్లీలో కలకలం రేపిన ఘటనకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే...

కోటక్ మహీంద్రా బ్యాంకులో రవికుమార్ (27) ఉద్యోగి. రాత్రి 7 గంటల సమయంలో సదర్ బజార్ లోని ఓ సినిమా హాల్ సమీపంలో వెళుతుండగా, అతని మెడపై ఏదో గుచ్చుకున్నట్టు అనిపించి, చేత్తో తాకి చూడగా, రక్తం చేతికి అంటింది. ఆ వెంటనే అతను కుప్పకూలినప్పటికీ, కొన్ని సెకన్ల వ్యవధిలోనే లేచాడు. ఈలోగా చుట్టుపక్కల ఉన్న వారు స్పందించి, అతని పక్కనే ఉన్న అనుమానితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఆ వెంటనే పోలీసులు రవికుమార్ ను ఆసుపత్రికి తరలించినప్పటికీ, 24 గంటల పాటు మృత్యువుతో పోరాడిన అతను, మరణించాడు.

స్థానికులు పట్టించిన అనుమానితుడుని 'కిల్లర్' ప్రేమ్ గా గుర్తించిన పోలీసులు, తమదైన శైలిలో విచారించి నిజాన్ని వెలికితీశారు. జిమ్‌ ట్రైనర్‌ గా పనిచేస్తున్న అనీశ్‌ యాదవ్‌ అనే వ్యక్తి, రవికుమార్ ను చంపాలని రూ. 1.5 లక్షలతో కాంట్రాక్ట్ ఇచ్చినట్టు తెలిపాడు. ఈ కేసులో అనీశ్ ను, ప్రేమ్ ను అరెస్ట్ చేసినట్టు ఉత్తర ఢిల్లీ డీసీపీ జతిన్ నర్వాల్ వెల్లడించారు. ఈ హత్య వెనుక రవికుమార్ భార్య ప్రమేయం ఉందా? అనే విషయమై విచారణ జరుపుతున్నట్టు పేర్కొన్నారు.

More Telugu News