: ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు త‌మ వ‌ద్ద ద‌మ్మిడీ కూడా లేదన్న ఢిల్లీ సీఎం.. యూపీలో పోటీకి 'ఆప్' దూరం

పిబ్ర‌వ‌రి 4న ఎన్నిక‌లు జ‌రిగే రాష్ట్రాల్లో పోటీ చేసేందుకు త‌మ వ‌ద్ద ద‌మ్మిడీ కూడా లేద‌ని ఢిల్లీ ముఖ్య‌మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అర‌వింద్ కేజ్రీవాల్ వెల్ల‌డించారు. గోవాలోని మ‌పుసాలో ఆదివారం నిర్వ‌హించిన స‌భ‌లో పాల్గొన్న కేజ్రీవాల్ మాట్లాడుతూ ఢిల్లీలో రెండేళ్లకుపైగా అధికారంలో ఉన్నా నిధుల‌ను వెన‌కేసుకోవ‌డం గురించి ఆలోచించ‌లేద‌న్నారు. మ‌రో రెండేళ్ల‌లో ఢిల్లీలో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు కూడా త‌మ వ‌ద్ద పైసా లేద‌ని పేర్కొన్నారు. 'ఆప్' ఒక్క‌టే నిజాయతీ గ‌ల పార్టీ అని, మిగ‌తావ‌న్నీ అవినీతి పార్టీల‌ని ఆయన ఆరోపించారు. త‌మ పార్టీ నేతలు నిజాయతీపరుల‌న్న సంగ‌తి బీజేపీ నేత‌లు సైతం అంత‌ర్గ‌త స‌మావేశాల్లో అంగీక‌రిస్తున్నార‌ని తెలిపారు.

గోవాలో బీజేపీ, కాంగ్రెస్‌, ఎంజీల‌పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించిన కేజ్రీవాల్ వాటికి రోజులు దగ్గర ప‌డ్డాయ‌ని హెచ్చ‌రించారు. గోవాలో 28-32 స్థానాలు గెలుచుకుని అధికారాన్ని చేజిక్కించుకుంటామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు.యూపీ ఎన్నిక‌ల్లో పోటీ చేసే ఉద్దేశం త‌మ‌కు లేద‌ని 'ఆప్' ప్ర‌క‌టించింది. అయితే ఆ రాష్ట్రంలో బీజేపీకి వ్య‌తిరేకంగా ప్రచారం  మాత్రం పెద్ద ఎత్తున నిర్వ‌హిస్తామ‌ని ఆ పార్టీ అధికార ప్ర‌తినిధి వైభ‌వ్ మ‌హేశ్వ‌రి పేర్కొన్నారు.

More Telugu News