: శ్రీలంకలో వేల కోట్ల చైనా పెట్టుబడి... వ్యతిరేకిస్తున్న వారిపై పోలీసుల దాష్టీకం

శ్రీలంకలో ప్రత్యేక పారిశ్రామిక జోన్ ను ఏర్పాటు చేసుకునే దిశగా చైనా ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టాలని నిర్ణయించుకోగా, తమ దేశంలో చైనా ప్రాబల్యం పెరుగుతుండటాన్ని నిరసిస్తూ, వందలాది మంది లంక పౌరులు వీధుల్లో నిరసన ప్రదర్శనలు, విధ్వంసానికి దిగారు. ప్రభుత్వ మద్దతుదారులు, పోలీసులపై రాళ్లు రువ్వారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు విరుచుకుపడ్డ పోలీసులు, టియర్ గ్యాస్, వాటర్ క్యానన్ లను ప్రయోగించారు. ఆ దేశ ప్రధాని రనిల్ విక్రమసింగే తో పాటు చైనా అంబాసిడర్ యీ క్సినాలింగ్ చూస్తుండగానే ఈ ఘటనలు జరిగాయి. నిరసనలు శ్రుతిమించడంతో, వారిపై పోలీసుల దాడితో 12 మంది పోలీసులు సహా 25 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు.

కాగా, కొలంబోకు 240 కిలోమీటర్ల దూరంలో ఉన్న హంబన్ తోట ప్రాంతంలో వేలాది మందికి ఉద్యోగాలను, ఉపాధిని అందించేలా చైనా ప్రభుత్వం 5 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 34 వేల కోట్లు) పెట్టుబడిగా పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ ప్రాజెక్టుతో తమ భూములు పోతాయన్నది ఇక్కడి నివాసుల ప్రధాన ఆరోపణ. చైనా పెట్టుబడులను వ్యతిరేకిస్తూ, నిరసనలకు దిగుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కొత్త పారిశ్రామిక జోన్ ఏర్పాటు నిమిత్తం ఎవరి భూములూ లాక్కోబోమని, ప్రాజెక్టుకు కేటాయించిన భూమిలో 95 శాతం ప్రభుత్వానిదేనని అధికారులు వెల్లడించారు.

More Telugu News