: సంక్రాంతిపై ఆశ‌లు పెట్టుకున్న ఏపీఎస్ ఆర్టీసీ.. 5 వేల ప్ర‌త్యేక బ‌స్సులు.. రూ.13 కోట్ల అద‌న‌పు ఆదాయ‌మే ల‌క్ష్యం!

హ‌రిదాసుల పాట‌లు, ముత్యాల ముగ్గుల్లో గొబ్బెమ్మ‌ల‌తో తెలుగు లోగిళ్ల‌కు కొత్త క‌ళ‌ను తీసుకొచ్చే పెద్ద పండుగ సంక్రాంతిపై ఏపీఎస్ ఆర్టీసీ భారీ ఆశ‌లు పెట్టుకుంది. పండుగ  సంద‌ర్భంగా దాదాపు రూ.13 కోట్ల వ‌ర‌కు అద‌న‌పు ఆదాయం సంపాదించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ప్ర‌త్యేకంగా 5వేల బ‌స్సులు న‌డిపేందుకు సిద్ధ‌మ‌వుతోంది. గ‌తేడాది ఏపీఎస్ ఆర్టీసీ హైద‌రాబాద్ నుంచి ఏపీలోని దాదాపు అన్ని ముఖ్య న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల‌కు 2,268 ప్ర‌త్యేక బస్సులు న‌డిపింది. మొత్తం 65 వేల మందిని హైద‌రాబాద్ నుంచి వారి సొంతూళ్ల‌కు చేర్చింది. సాధార‌ణ ప్ర‌యాణికుల‌కు ఇది అద‌నం. అలాగే తిరుగు ప్ర‌యాణం కోసం 2 వేల ప్ర‌త్యేక బస్సుల‌ను న‌డిపింది.

ఈసారి హైద‌రాబాద్ నుంచి ఏపీలోని సొంతూళ్ల‌కు 70 వేల మంది వెళ్తార‌ని అంచ‌నా వేస్తున్న‌ట్టు ఏపీఎస్ ఆర్టీసీ చీఫ్ ప్యాసింజ‌ర్ ట్రాఫిక్ మేనేజ‌ర్ బ్ర‌హ్మానంద‌రెడ్డి తెలిపారు. ఇందుకు హైద‌రాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాల‌కు 2,500 బ‌స్సుల‌ను ప్ర‌త్యేకంగా న‌డుపుతున్న‌ట్టు తెలిపారు. అలాగే తిరుగు ప్ర‌యాణంలో కూడా అంతే సంఖ్య‌లో బ‌స్సులు న‌డుపుతామ‌ని పేర్కొన్నారు. ఈనెల 11, 12 తేదీల్లో ప్ర‌యాణికుల ర‌ద్దీ మ‌రింత అధికంగా ఉండే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు. కాగా ప్ర‌త్యేక బ‌స్సుల్లో ప్ర‌యాణికుల నుంచి 50శాతం అద‌న‌పు చార్జీల‌ను ఆర్టీసీ వ‌సూలు చేస్తోంది.

 

More Telugu News