: పెద్ద డౌటు.. దావూద్ 15 వేల కోట్ల ఆస్తులు సీజ్ వార్తను బీజేపీ కల్పించిందా?

కరుడుగట్టిన అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు సంబంధించిన 15,000 కోట్ల రూపాయల ఆస్తులను సౌదీ అరేబియా ప్రభుత్వం సీజ్ చేసిందని, గతంలో మోదీ సౌదీఅరేబియా వెళ్లినప్పుడు చేసుకున్న ఒప్పందాల పర్యవసానంగా దావూద్ ఆస్తులు స్వాదీనం చేసుకుందని భారతీయ మీడియా గొప్పగా కథనాలు ఇచ్చేసింది. అయితే ఇది వాస్తవం కాదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి కారణం ఏంటంటే... ముందుగా ఈ వార్తను 'జీ న్యూస్' తన బ్యూరో వార్తగా ప్రచుటించింది. ఆ వెంటనే మిగతా మీడియా అంతా రాసేసింది. అలాగే ‘దౌత్యపరంగా ఇది భారత ప్రధాని నరేంద్రమోదీ సాధించిన ఘన విజయం’ అంటూ భారతీయ జనతా పార్టీ ట్వీట్‌ కూడా చేసింది. దీనిపై నిజానిజాలు తెలుసుకునేందుకు మీడియా ప్రయత్నించగా జీన్యూస్ కు సంబంధించిన వారెవరూ స్పందించలేదు.

అసలు ఈ వార్తకు ఆధారం ఏంటి? అన్నదానిని తెలిపేందుకు జీ న్యూస్ వాళ్లు నిరాకరించారు. అదే సమయంలో సౌదీఅరేబియాలో భారతీయ ఎంబసీ, భారత్ కు సంబంధించిన మీడియా ప్రతినిధులు అలాంటి వార్త ఏమీ లేదని, దీనిపై తమకు సమాచారం ఏమీ లేదని తెలిపారు. దీంతో బీజేపీ అధికార ప్రతినిధి శ్రీకాంత్‌ శర్మను తోటి జర్నలిస్టులు ప్రశ్నించగా, పార్టీలోని సమాచార, సాంకేతిక విభాగం ముందుగా ట్వీట్‌ చేసిందని, దానికి ఇప్పటికీ తాము కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు. మోదీ 2015, ఆగస్ట్‌ నెలలో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ను సందర్శించి, అక్కడి ప్రభుత్వంతో పలు ఒప్పందాలు చేసుకున్నారని, ఆయన నాడు నెరపిన దౌత్యం కారణంగా దావూద్‌ ఆస్తులను అక్కడి ప్రభుత్వం జప్తు చేసిందని, ఇది మోదీ విజయమని వ్యాఖ్యానించారు.

ఇంతకూ ఈ వార్తకు ఆధారం ఏమిటని ప్రశ్నించగా, పార్టీ సమాచార విభాగానికి చాలా మార్గాల నుంచి సమాచారం వస్తుంటుందని, ఏదో మార్గం నుంచి సమాచారం రావడం వల్లనే ట్వీట్‌ చేశారని చెప్పారు. సోర్స్‌ మాత్రం చెప్పలేదు. ఈ వార్తను ప్రచురించిన జీ న్యూస్ కూడా ‘ఎకార్డింగ్‌ టు మీడియా రిపోర్ట్స్‌’ అని పేర్కొంది తప్ప, సోర్స్ చెప్పలేదు. దీంతో పెద్ద నోట్ల రద్దుతో పార్టీకి ఏర్పడ్డ మచ్చను తొలగించేందుకు ఆ పార్టీ ఆడుతున్న గిమ్మిక్కుగా నెటిజన్లు పేర్కొంటున్నారు. 

More Telugu News