: పాక్ ను చిత్తు చేసిన ఆస్ట్రేలియా... సిరీస్ క్లీన్ స్వీప్

సిడ్నీలో పాక్ తో జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 220 పరుగుల తేడాతో పాక్ ను కంగారూలు చిత్తు చేశారు. దీంతో, మూడు టెస్టుల ఈ సిరీస్ ను ఆసీస్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. చివరి రోజు ఆటను 55/1 స్కోరు వద్ద ప్రారంభించిన పాకిస్థాన్... 244 పరుగులకు ఆలౌట్ అయింది.  అజహర్ అలీ (11), యాసిర్ షా (3)లు ఆట ప్రారంభమైన కాసేపటికే పెవిలియన్ చేరడంతో... పాక్ ఓటమివైపుగా పయనించింది. మధ్యలో మిస్బా ఉల్ హక్ (38), అసద్ షఫిక్ (30)లు పర్వాలేదనిపించారు. సర్ఫరాజ్ అహ్మద్ 72 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. అయితే, సర్ఫరాజ్ కు ఇతర బ్యాట్స్ మెన్ నుంచి సహకారం అందలేదు. ఈ నేపథ్యంలో, పాక్ కు భారీ ఓటమి తప్పలేదు. ఆసీస్ బౌలర్లలో స్టీవ్ ఓ కీఫ్, హజల్ వుడ్ లు తలా మూడు వికెట్లు తీయగా... లయన్ రెండు, స్టార్క్ ఒక వికెట్ పడగొట్టారు.

స్కోరు వివరాలు:
ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 538/8 డిక్లేర్, రెండో ఇన్నింగ్స్ 241/2 డిక్లేర్
పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్  315 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 244 ఆలౌట్

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా డేవిడ్ వార్నర్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా స్టీవెన్ స్మిత్ ఎంపికయ్యారు.

More Telugu News