: గోవాలో బీజేపీకి షాకిచ్చిన మిత్రపక్షం!

గోవాలో బీజేపీకి మిత్రపక్షం మహారాష్ట్ర వాదీ గోమంతక్ పార్టీ (ఎంజీపీ) మద్దతు ఉపసంహరించుకుంది. గోవా శాసనసభ ఎన్నికల తేదీలను ఈసీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎంజీపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో బీజేపీకి ఎదురుదెబ్బతగిలింది. అంతటితో ఆగని ఎంజీపీ, త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా సుదిన్‌ ధవలికర్‌ ను అప్పుడే ప్రకటించేసింది. ఇదే విషయాన్ని తెలుపుతూ గవర్నర్‌ మృదులా సిన్హాకు లేఖ కూడా రాసింది. దీంతో బీజేపీతో చర్చలకు సిద్ధంగా లేనట్టు స్పష్టంగా చెప్పినట్టైంది. దీంతో పాటు కూటమి నుంచి తక్షణం వైదొలుగుతున్నామని ఆ లేఖలో తేల్చేసింది.

కాగా, గోవాలో మొత్తం 40 స్థానాలకు ఫిబ్రవరి 4న పోలింగ్‌ జరుగనుంది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఈ నెల 11న విడుదల కానుంది. దీనికి సంబంధించి నామినేషన్ల దాఖలుకు ఈ నెల 18 చివరి తేదీ కాగా, నామినేషన్ల పరిశీలన 19 వరకు, నామినేషన్లు ఉపసంహరణకు ఈ నెల 21 వరకు ఈసీ గడువు విధించింది. ఈ నేపథ్యంలో మిత్రపక్షం హ్యాండివ్వడం బీజేపీకి ఎదురుదెబ్బే అనడంలో సందేహం లేదు. కాగా, గోవాలో బీజేపీకి 'ఆప్' గట్టిపోటీ ఇస్తున్న సంగతి తెలిసిందే. 

More Telugu News