h 1 b visa: హెచ్‌1బి వీసా సవరణల బిల్లులో ప్రధానంగా రెండు కీలక అంశాలు!

అమెరికాలోని కంపెనీల్లో ఉద్యోగాలు చేయ‌డానికి విదేశీయులు ఉప‌యోగించే హెచ్‌1బి వీసాను కొందరు దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలతో ఆ వీసా జారీకి నిబంధ‌న‌ల విష‌యంలో అమెరికా ప‌లు మార్పులు చేర్పులు చేస్తోంది.  ప్రోగ్రామ్‌లో మార్పులు చేస్తూ రూపొందించిన బిల్లును ఆ దేశ‌ కాంగ్రెస్‌లో మళ్లీ ప్రవేశపెట్టారు. ఈ బిల్లులో ప్ర‌ధానంగా ప‌లు మార్పులు చేసే అవ‌కాశం క‌నిపిస్తోంది. వీసా ఉన్నవారికి కనీస వార్షిక వేతనం లక్ష డాలర్లు ఉండాల‌ని నిబంధ‌న‌గా పెట్టాల‌ని, అంతేగాక వీసా పొందాలంటే మాస్టర్‌ డిగ్రీ ఉండాలన్న నిబంధనను మినహాయింపుని తొలగించాల‌ని భావిస్తున్నారు. ఈ మార్పుల ద్వారా వీసా దుర్వినియోగాన్ని అరికట్టవచ్చని ఆ దేశ అధికారులు భావిస్తున్నారు. ఈ బిల్లుతో నిజమైన ప్రతిభావంతులకే త‌మ దేశంలో ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయని అంటున్నారు.
 
డిస్నీ వంటి ప్ర‌ముఖ కంపెనీలు హెచ్‌1బి వీసాను దుర్వినియోగం చేస్తున్నట్లు ప‌లు ఆరోపణలు వ‌స్తున్నాయ‌ని, అందుకే ఈ బిల్లును మ‌ళ్లీ ప్ర‌వేశ‌పెట్టాల‌ని యోచిస్తున్నట్లు అక్క‌డి అధికారులు తెలిపారు. ఈ బిల్లుని అమెరికా కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టిన సభ్యులు స్పందిస్తూ... త‌మ దేశం అగ్రరాజ్యం హోదాను నిల‌బెట్టుకోవాలంటే ప్రపంచంలోని ప్రతిభావంతుల్ని, నిపుణుల్ని త‌మ‌తోపాటే ఉంచుకోవాల‌ని అన్నారు. మ‌రోవైపు కంపెనీలు అవుట్‌ సోర్సింగ్‌ పేరుతో త‌మ‌దేశ‌ ఉద్యోగుల స్థానాల్లో తక్కువ వేత‌నాల‌కు విదేశీయులను నియమించుకుంటూ వీసా ప్రోగ్రామ్స్‌ దుర్వినియోగం చేయకుండానూ చూసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది కాబ‌ట్టి ఈ బిల్లును తీసుకొస్తున్న‌ట్లు తెలిపారు. ఈ రెండు అంశాల‌కు త‌గ్గ‌ట్లుగా ఈ బిల్లును తీసుకొస్తున్న‌ట్లు చెప్పారు.  అమెరికన్ల ఉద్యోగాలకు భద్రత కూడా ల‌భిస్తుంద‌ని చెప్పారు.

More Telugu News