: ఆర్‌బీఐపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన పేదమ‌హిళ‌... అందరూ ఆశ్చర్యపోయేలా గేటుముందే నిర‌స‌న‌!

పెద్ద‌నోట్లను ర‌ద్దు చేస్తూ కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం పేద‌ల‌ను ఎన్నో ఇబ్బందుల‌కు గురిచేస్తోన్న విష‌యం తెలిసిందే. ఇటువంటి ఇబ్బందులే ఎదుర్కున్న ఓ మ‌హిళ తీవ్ర ఆగ్రహానికి గురయింది. తన వ‌ద్ద ఉన్న‌ కొన్ని పాత నోట్లను పట్టుకొని వాటిని మార్చుకునేందుకు న్యూఢిల్లీలోని ఆర్‌బీఐ చుట్టూ తిరుగుతున్నా ప‌ని కాక‌పోవ‌డంతో తీవ్ర అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేస్తూ అంద‌రూ చూస్తుండ‌గానే గేటు ముందే తన బట్టలు విప్పేసి నిరసన వ్యక్తం చేసింది. ఇళ్లల్లో పనిచేసి జీవితాన్ని నెట్టుకొస్తున్న ఆ మహిళ నాలుగేళ్ల పాపను తీసుకొని రెండు రోజుల నుంచి ఆర్‌బీఐ వద్దకు వస్తోందని, త‌న దగ్గరున్న రూ.నాలుగువేల పాత నోట్లను తీసుకొని కొత్త నోట్లను ఇవ్వాలని బ్యాంకు సిబ్బందిని కోరుతోంద‌ని పోలీసులు తెలిపారు.

అయితే, న‌గ‌దు మార్పిడి ఇప్పుడు సాధ్యం కాదని ఆమెకు బ్యాంకు సిబ్బంది చెప్పి పంపిస్తున్నార‌ని, అయినప్పటికీ ఆమె క్యూలో నిల్చొంటుంద‌ని, తనకు డబ్బు ఇవ్వాల్సిందేనంటూ వాదించింద‌ని చెప్పారు. దీంతో తాము ఆమెను బలవంతంగా జీపులోకి ఎక్కించేందుకు ప్రయత్నించడంతో ఆ మ‌హిళ ఈ సాహ‌సానికి పాల్ప‌డింద‌ని పోలీసులు తెలిపారు. చివరికి ఆమెకు తిరిగి బట్టలు అందించిన అక్క‌డి వారు ఆమెను మ‌ళ్లీ బ్యాంకు అధికారుల వద్దకు తీసుకెళ్లారు. అయితే, ఆమె గుర్తింపు కార్డు కూడా తీసుకురాలేద‌ని, అంతేగాక‌ ఆమె తీసుకొచ్చిన నోట్లు చిరిగిపోయి ఎలుకలు కొరికి ఉన్నాయని బ్యాంకు సిబ్బంది తెలిపారు. అనంత‌రం ఆమెను పోలీసులు వ‌దిలేశారు.

More Telugu News