: మనకు పెను నష్టం... ఉత్పత్తి హబ్ గా ఇండియా మారుతోంది జాగ్రత్త... చైనా ప్రభుత్వాన్ని హెచ్చరించిన మీడియా!

చైనాలో ఉత్పత్తి రంగాన్ని మరింతగా ఆధునికీకరించకుంటే, ఇండియా ముందడుగు వేస్తుందని, దీని వల్ల భవిష్యత్తులో కష్టపడాల్సి వుంటుందని చైనా మీడియా ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసింది. టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ ఇండియాలో విస్తరించేందుకు వేస్తున్న ప్రణాళికలను ప్రస్తావించిన ప్రభుత్వ రంగ పత్రిక 'గ్లోబల్ టైమ్స్' విదేశీ కంపెనీలను చైనా మరింతగా ఆకర్షించాల్సి వుందని పేర్కొంది. యాపిల్ సంస్థ దక్షిణాసియా దేశాల వైపు చూస్తుండటం, చైనాపై ఒత్తిడిని పెంచుతోందని, చైనాలో దేశవాళీ ఉత్పత్తి రంగం విదేశీ వస్తువుల తయారీకి అనుకూలంగా ఉన్నప్పటికీ, ఆయా కంపెనీలు తక్కువ ధరలో పని జరిగే దేశాలవైపు నడుస్తున్నాయని పేర్కొంది.

మరోవైపు అమెరికాలో మాన్యుఫాక్చరింగ్ జాబ్స్ సంఖ్యను పెంచుతామని, అమెరికా కంపెనీలు అమెరికాలోనే ప్రొడక్షన్ ప్లాంట్లను ఏర్పాటు చేసేలా ఒత్తిడి తెస్తామని డొనాల్డ్ ట్రంప్ చెబుతుండటాన్ని కూడా 'గ్లోబల్ టైమ్స్' ప్రస్తావించింది. ఉత్పత్తి రంగంలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న చైనాను ఇప్పట్లో భారత్ దాటుతుందా? అన్న విషయాన్ని పక్కన పెడితే, పలు పెద్ద పెద్ద టెక్నాలజీ, రక్షణ సంస్థలు ఆ దేశంలో యూనిట్లను మొదలు పెట్టాలన్న నిర్ణయానికి రావడం చైనాకు నష్టాన్ని కలిగించే అంశమని అభిప్రాయపడింది. యాపిల్ సంస్థకు విడి భాగాలను అందించే ఫాక్స్ కాన్ టెక్నాలజీ గ్రూప్, పెగాట్రాన్ కార్పొరేషన్, విస్ట్రాన్ కార్పొరేషన్ సంస్థలు ఇండియాలో కార్యకలాపాలు ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. భారత్, చైనాల మధ్య పారిశ్రామిక పోటీ పెరుగుతోందని, ఇండియా శరవేగంగా చైనా దగ్గరకు వస్తోందని 'గ్లోబల్ టైమ్స్' అభిప్రాయపడింది.

More Telugu News