: 'మెగా' పాత్రలతో మొబైల్ గేమ్... చిరంజీవి సినిమాకు వెరైటీ ప్రమోషన్!

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నంబర్ 150'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపు 9 ఏళ్ల తర్వాత వస్తున్న చిరంజీవి సినిమా రికార్డులను తిరగరాస్తుందని అభిమానులు భావిస్తున్నారు. మరోవైపు నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి' అదే సమయంలో రిలీజ్ కానుండటంతో... ఈ రెండు సినిమాల మధ్య భారీ పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ విషయంలో ఏ చిన్న అవకాశాన్ని కూడా 'ఖైదీ' యూనిట్ వదులుకోవడం లేదు. బాలీవుడ్ తరహాలో సినిమా రిలీజ్ కు ముందు ఓ మొబైల్ గేమ్ ను రిలీజ్ చేయనుంది. ఈ గేమ్ లో వివిధ సినిమాల్లోని చిరంజీవి క్యారెక్టర్లు దర్శనమిస్తాయి. అడవిదొంగ, ఖైదీ, కొండవీటి దొంగ, జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాల్లోని చిరంజీవి యానిమేషన్ పాత్రలు ఈ గేమ్ లో సాహసాలు చేస్తాయి. ఈ గేమ్ కు 'బాస్ ఇన్ గేమ్ మెగా 150' అనే పేరు పెట్టారు. ఈ గేమ్ కు సంబంధించిన టీజర్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. జనవరి 9న ఈ గేమ్ మార్కెట్లోకి విడుదల అవుతోంది.


More Telugu News