: జైలుపై భారీ దాడికి తెగబడిన దుండగులు... 150 మంది ఖైదీలు పరార్‌

దక్షిణ ఫిలిప్పీన్స్‌లోని మిందనావో ద్వీపంలోని నార్త్‌ కొటబాటొ జిల్లా జైలులో తీవ్ర క‌ల‌క‌లం చెల‌రేగింది. ఆయుధాల‌తో వ‌చ్చిన ప‌లువురు దుండ‌గులు జైలుపై భారీ దాడి చేయడంతో అదే అదునుగా జైలులోని 150 మంది ఖైదీలు పారిపోయారు. ఈ దాడికి పాల్ప‌డింది ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర‌వాద సంస్థ‌కు చెందిన వారే అయి ఉండ‌వ‌చ్చ‌ని అధికారులు భావిస్తున్నారు. ఈ దాడిపై అక్క‌డి అధికారులు వివ‌రిస్తూ... జైలును భారీ సంఖ్యలో సాయుధులు చుట్టుముట్టార‌ని అనంత‌రం జైలులోని గార్డులు, భద్రతా సిబ్బందిపై రెండు గంట‌ల‌పాటు కాల్పులు జరిపారని చెప్పారు.

ఈ సమ‌యంలోనే జైలులోని ఖైదీలు ప‌రార‌య్యార‌ని తెలిపారు. ఫిలిప్పీన్స్‌లో ప‌దేళ్ల‌ కాలంలో జైళ్లపై దాడిచేసి ఖైదీలను విడిపించుకున్న ఘటనల్లో ఇది మూడో అతి పెద్ద ఘటన అని చెప్పారు. ఈ కాల్పుల్లో ఒక గార్డు మృతి చెంద‌గా, మరో ఖైదీకి గాయాల‌యిన‌ట్లు స‌మాచారం. స‌ద‌రు జైలులో మొత్తం 1500 మంది ఖైదీలు ఉన్నారని అధికారులు చెప్పారు. ఈ ప్రాంతంలో కాథలిక్‌ క్రైస్తవులు అధికంగా ఉంటారు. కొన్ని దశాబ్దాలుగా వేర్పాటువాద శ‌క్తులు ఇక్క‌డ అల‌జ‌డి సృష్టిస్తున్నాయి. ఆ జైలులో ఉన్న ఇస్లామిక్ తీవ్రవాదులను త‌ప్పించ‌డానికే  ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.

More Telugu News