: 'సైకిల్' పోతే 'చెట్టు' ఎక్కచ్చు!.. యూపీ సీఎం అఖిలేష్‌కు అండ‌గా మాజీ ప్ర‌ధాని పార్టీ.. సినిమాను త‌ల‌పిస్తున్న యూపీ రాజ‌కీయాలు!

ఉత్త‌రప్ర‌దేశ్ రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. రోజుకో సంచ‌ల‌నంతో దేశ ప్ర‌జ‌ల దృష్టిని త‌మ‌వైపు ఆకర్షిస్తున్నాయి. తండ్రీకొడుకుల పోరులో గెలుపెవ‌రిదో తెలియ‌క యూపీ ప్ర‌జ‌లు బుర్ర‌లు బ‌ద్ద‌లుగొట్టుకుంటుంటే ప్ర‌తిప‌క్షాలు త‌మాషా చూస్తున్నాయి. మ‌రోవైపు రానున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సైకిల్ గుర్తుతోనే ముందుకెళ్లాల‌ని ప‌ట్టుద‌లతో ఉన్న ములాయం, అఖిలేష్ వ‌ర్గాల‌కు ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ షాకిచ్చే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. సైకిల్ గుర్తును ఎవ‌రికీ కేటాయించ‌కుండా ఇద్ద‌రికీ వేర్వేరు గుర్తులు కేటాయించాల‌ని భావిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. దీంతో రెండు వ‌ర్గాలు కంగుతిన్నాయి.

ఒక‌వేళ ఈసీ అన్నంత ప‌నీచేస్తే ఏం చేయాల‌న్న దానిపై అఖిలేష్ ఇప్ప‌టికే ప్ర‌ణాళిక సిద్ధం చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. మరోవైపు మాజీ ప్ర‌ధాని చంద్ర‌శేఖ‌ర్ పార్టీ స‌మాజ్‌వాదీ జ‌న‌తా పార్టీ-రాష్ట్రీయ‌(ఎస్‌జేపీ-ఆర్‌) అఖిలేష్‌ను అక్కున చేర్చుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. త‌మ పార్టీ గుర్తు 'చెట్టు'తో ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌ని ఇప్ప‌టికే అఖిలేష్‌కు సూచించిన‌ట్టు స‌మాచారం.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ గుర్తుతో పోటీ చేయ‌వ‌చ్చ‌ని ఎస్‌జేపీ-ఆర్ ప్ర‌స్తుత అధ్య‌క్షుడు క‌మ‌ల్ మొరార్కా.. అఖిలేష్‌కు ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. ఈ విష‌యంలో అఖిలేష్‌ను మోరార్కా  సంప్ర‌దించిన మాట వాస్త‌వ‌మేన‌ని అఖిలేష్ వ‌ర్గం ధ్రువీక‌రించింది. దీంతో యూపీ రాజ‌కీయాల్లో మ‌రో ట్విస్ట్ మొద‌లైంది. అయితే అఖిలేష్ మాత్రం సైకిల్ గుర్తు త‌న‌కే వ‌స్తుంద‌ని ఆశాభావంతో ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌ ఎస్‌జేపీకి ద‌గ్గ‌ర‌వుతారా? లేక వేరే గుర్తుతో ముందుకెళ్తారో వేచి చూడాల్సిందే.

More Telugu News