: యూపీ రాజకీయం: 'సైకిల్' దక్కేది ఎవరికి.. తండ్రికా? కొడుకుకా?

సమాజ్‌వాదీ పార్టీలో పుట్టిన ముసలం ఆ పార్టీకి ఈ ఎన్నికల్లో తీవ్ర నష్టం కలిగించేలా కనిపిస్తోంది. సమాజ్ వాదీ పార్టీ రెండుగా చీలిపోవడంతో పార్టీ గుర్తు సైకిల్‌ ను తనకు కేటాయించాలని ఆ పార్టీ అధినేత, వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ఈ సాయంత్రం ఢిల్లీలోని ఈసీని కలిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యూపీలోని అఖిలేష్ వర్గం పార్టీ గుర్తును దక్కించుకునేందుకు పావులు కదిపే అవకాశం ఉంది. దీంతో సైకిల్ గుర్తును ఏ వర్గానికీ కేటాయించకుండా కొద్ది రోజులు నిలిపివేసే అవకాశాలు ఉన్నాయని కేంద్ర మాజీ ఎన్నికల అధికారి ఖురేషీ తెలిపారు. ఢిల్లీలో దీనిపై స్పందించిన ఆయన, గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి నెలకొనలేదని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇరు వర్గాలకు చెందిన వారు అఫిడవిట్లు, ఆధారాలు సమర్పించాలని చెప్పారు.

తమ మద్దతుదారుల సంతకాలు సేకరించి ఆ అఫిడవిట్ కు జతచేయాలని, మెజారిటీ ఎవరికి ఉంటే వారికి పార్టీ చిహ్నాన్ని కేటాయిస్తారని తెలిపారు. అయితే ఈ ప్రక్రియ ప్రారంభమై ముగిసేందుకు నాలుగు నుంచి ఐదు నెలల సమయం పడుతుందని ఆయన చెప్పారు. తానెప్పుడూ ఇటువంటి పరిస్థితిని చూడలేదని, ప్రస్తుతం యూపీలో ఇరు వర్గాలకు మద్దతు ఎక్కువగానే ఉందని ఆయన తెలిపారు. ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన సమయం కూడా లేదని ఆయన చెప్పారు. ఇలాంటి సమయంలో ఎన్నికల సంఘం కొంత కాలం ఈ గుర్తును ఎవరికీ కేటాయించకుండా, రెండు వర్గాలకు కొత్త గుర్తులను కేటాయించే అవకాశముందని ఆయన తెలిపారు. 

More Telugu News