: మోదీజీ...ఇవన్నీ రేపటి నుంచి జరుగుతాయా?: కాంగ్రెస్ నేత రణ్ దీప్ సూర్జేవాలా

పెద్దనోట్ల రద్దు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడిన మాటలను కాంగ్రెస్ పార్టీ నేత రణ్ దీప్ సుర్జేవాలా గుర్తు చేశారు. ఢిల్లీలో ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ, పెద్ద నోట్ల రద్దుతో 50 రోజుల పాటు నగదు కష్టాలు ఉంటాయని, ఆ తరువాత అన్నీ పోతాయని, అవినీతి రహిత భారతదేశాన్ని చూస్తారని ప్రధాని ప్రకటించారని, అందులో ఎంత వరకు సఫలీకృతులయ్యారో చెప్పాలని డిమాండ్ చేశారు. రేపటి నుంచి మామూలుగా నగదు బ్యాంకుల నుంచి విత్ డ్రా చేసుకోవచ్చా? ఇకపై బ్యాంకుల ముందు క్యూ కట్టాల్సిన పని లేదా? అని ఆయన ప్రశ్నించారు.

దేశంలోని ఏటీఎంలన్నీ రేపటి నుంచి పనిచేస్తాయా? అని ఆయన అడిగారు. పెద్ద నోట్ల రద్దు కారణంగా బ్యాంకుల ముందు రోజుల తరబడి క్యూలలో నిల్చుని, ఉద్యోగాలు కోల్పోయిన కార్మికులకు మీరు ఉద్యోగాలు ఇస్తారా? అని ఆయన ప్రశ్నించారు. చిరు వ్యాపారులకు పన్నులో 50 శాతం రాయితీ కల్పిస్తారా? అని ఆయన అడిగారు. రైతులకు కనీస మద్దతు ధర 20 శాతం ఇస్తారా? అని ఆయన నిలదీశారు. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ అడుగుతున్న ప్రశ్నలు కాదని, సామాన్య ప్రజానీకం అడుగుతున్న ప్రశ్నలని ఆయన తెలిపారు. 

More Telugu News