demonitisation: ఈ యాభై రోజులు మీడియా న‌న్ను ప్ర‌శ్నించింది.. వారికి కృతజ్ఞతలు!: ప్ర‌ధాని మోదీ

ఢిల్లీలో ఈ రోజు నిర్వ‌హించిన డిజీ-ధ‌న్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ... డిజిట‌ల్ లావాదేవీలు జ‌రుపుతున్న‌ వారికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. పెద్ద‌నోట్ల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు నిర్ణ‌యం తీసుకున్న సంద‌ర్భంగా ఈ యాభై రోజులు త‌న‌ను మీడియా ప్ర‌శ్నించింద‌ని, ఇండియా డిజిట‌ల్ లావాదేవీల దిశ‌గా ఎలా న‌డుస్తుంద‌ని, పేద‌వారి ద‌గ్గ‌ర క‌నీసం మొబైల్ కూడా ఉండ‌ద‌ని చెప్పింద‌ని ఆయ‌న అన్నారు. త‌న‌ను ప్ర‌శ్నించిన మీడియాకు కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్న‌ట్లు పేర్కొన్నారు.

ఎందుకంటే, మీడియా వేసిన ప్ర‌శ్న‌ల‌ను ప‌రిశీలించే తాము న‌గ‌దుర‌హిత లావాదేవీల దిశ‌గా ప‌లు ప‌థ‌కాల‌ను రూపొందించాలని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు చెప్పారు. చ‌దువురాని వారు సైతం న‌గ‌దుర‌హిత లావాదేవీలు చేసేలా ఆలోచ‌న‌లు చేశామ‌ని చెప్పారు. చ‌దువురాని వారు కూడా గత ఎన్నికల్లో ఈవీఎంల ద్వారా ఓటేశారని గుర్తు చేశారు. కేవలం వేలి ముద్రతో లావాదేవీలు జరిపిస్తున్నామని చెప్పారు. మొన్న‌టి వ‌ర‌కు స్కాంల గురించి మాట్లాడుకునే వారని, ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేద‌ని మోదీ అన్నారు. దేశంలోని నిరాశావాదుల కోసం త‌న‌ ద‌గ్గ‌ర ఏమీ లేదని, ఆశావాదులకి అవ‌కాశాలు అందించే ఆలోచ‌నలు మాత్రం ఉన్నాయని చెప్పారు.

More Telugu News