obama: ర‌ష్యాపై అమెరికా చ‌ర్య‌లు ప్రారంభం... ప్రతీకారం తీర్చుకుంటామంటున్న రష్యా!

త‌మ దేశ‌ అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో రష్యా జోక్యం చేసుకున్నందుకు ర‌ష్యాపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఇటీవ‌లే తెలిపిన అమెరికా ఆ దిశ‌గా ముందుకు వెళుతోంది. ర‌ష్యాపై ఆర్థిక, దౌత్యపరమైన ఆంక్షలు విధించేందుకు తాము సిద్ధ‌మ‌యిన‌ట్లు ఒబామా ప్ర‌భుత్వం తెలిపిన విష‌యం తెలిసిందే. త‌మ దేశ అధ్య‌క్ష‌ ఎన్నికల్లో ర‌ష్యా సైబర్‌ ఆపరేషన్స్‌లో జోక్యం చేసుకోవడం, కోవర్ట్‌ ఆపరేషన్‌ వంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డింద‌ని ఒబామా ప్ర‌భుత్వం తెలిపింది.

రష్యా స్పై ఏజెన్సీలు, 35 మంది డిప్లొమాట్స్ పై చర్యలు తీసుకున్న‌ట్లు అమెరికా పేర్కొంది. దీంతో ఇరు దేశాల మ‌ధ్య స‌త్సంబంధాలు మ‌రింత బ‌ల‌హీన‌ప‌డుతున్నాయి. రష్యా చేసిన తప్పులకు శిక్ష అనుభవిస్తుందని ఓవైపు అమెరికా పేర్కొనగా మ‌రోవైపు ర‌ష్యా ఈ అంశంపై స్పందిస్తూ, ఒబామా దద్దమ్మ పాలన చేస్తున్నారని, తమ డిప్లొమాట్స్ ను తొలగించడంపై ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చ‌రించింది.

రష్యా వాడిన సైబర్ ట్రిక్కుల గురించి మరింతగా వివరించాలని ఐదు ఫెడరల్ ఏజెన్సీలను అమెరికా ప్రభుత్వం కోరింది. ర‌ష్యా ఇప్పుడు కూడా త‌మ దేశంపై కుట్రపూరిత దాడికి పాల్పడేందుకు చూస్తోందని ఒబామా పేర్కొన్నారు. అలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయ‌న హెచ్చ‌రించారు. అమెరికా రష్యాపై ప్రతీకారం తీర్చుకుంటుందని ఆయ‌న చెప్పారు.  

అమెరికాలోని రష్యా ఎంబసీలో పని చేస్తున్న వారిని అమెరికా తొల‌గించిన సంగ‌తి తెలిసిందే. వారంతా రష్యా ఇంటెలిజెన్స్ కు చెందిన వారని ఒబామా పేర్కొన్నారు. న్యూయార్క్, మేరిల్యాండ్ లలోని ఆ దేశ ఆఫీసుల‌ను మూసివేస్తున్నట్లు చెప్పారు. రష్యాలోని అమెరికా ఎంబసీలోని అధికారులను వేధింపులకు గురి చేస్తున్నారని ఒబామా ఆరోప‌ణ‌లు గుప్పించారు. అయితే తాము అమెరికా ఎన్నికల ప్రచారంలో జోక్యం చేసుకున్నామ‌నే ఆరోప‌ణ‌లను ర‌ష్యా ఖండిస్తోంది.

More Telugu News