: మంత్రి గంటా శ్రీనివాస‌రావు ఆస్తులు స్వాధీనం.. ప్ర‌క‌టించిన ఇండియ‌న్ బ్యాంక్‌!

ఏపీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు ఆస్తుల‌ను స్వాధీనం చేసుకోనున్న‌ట్టు విశాఖ‌ప‌ట్ట‌ణంలోని ఇండియ‌న్ బ్యాంకు బ్రాంచి ప్రక‌టించింది. ఆయ‌న హామీగా ఉన్న కంపెనీ రూ.141.68 కోట్ల రుణం తీసుకుని తిరిగి చెల్లించ‌డంలో విఫ‌లం కావ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిపింది. ప్ర‌త్యూష రిసోర్సెస్ అండ్ ఇన్‌ఫ్రా కంపెనీ డైరెక్ట‌ర్లు అయిన ప‌రుచూరి రాజారావు, ప‌రుచూరి ప్ర‌భాక‌ర‌రావు,  ప‌రుచూరి వెంక‌ట భాస్క‌ర‌రావు త‌దిత‌రులు వివిధ ప్రాంతాల్లోని భూములు, భ‌వ‌నాలు త‌న‌ఖా పెట్టి బ్యాంకు నుంచి  విడ‌త‌ల‌వారీగా రుణం తీసుకున్నారు. వీరికి మంత్రి గంటాతోపాటు మ‌రికొంద‌రు హామీ ఇచ్చారు.

ప్ర‌త్యూష రిసోర్సెస్ అండ్ ఇన్‌ఫ్రా కంపెనీ రుణంగా తీసుకున్న మొత్తం వ‌డ్డీతో క‌లిపి ప్ర‌స్తుతం రూ.196.51 కోట్లకు చేరింది. దీనిని స‌కాలంలో చెల్లించ‌డంలో కంపెనీ విఫ‌లం కావ‌డంతో బ్యాంకు నోటీసులు పంపింది. అయినా వారి నుంచి ఎటువంటి స్పంద‌న లేక‌పోవ‌డంతో హామీగా పెట్టిన ఆస్తుల‌ను స్వాధీనం చేసుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించింది. మంత్రి హామీగా పెట్టిన వాటిలో విశాఖ, ఎంవీపీ కాల‌నీలోని ఆయ‌న ఇల్లు, బాల‌య్య‌శాస్త్రి లేఅవుట్‌లోని ఫ్లాటు, అన‌కాప‌ల్లి, చోడ‌వ‌రంలోని వ్య‌వ‌సాయ‌భూమి, కూర్మ‌న్న‌పాలెంలోని కొంత భూమి ఉన్న‌ట్టు బ్యాంకు వివ‌రించింది.

More Telugu News