: 'రింగింగ్ బెల్స్' కథ కంచికి చేరినట్టేనా?

కేవలం 251 రూపాయలకే ఫ్రీడం 251 స్మార్ట్ ఫోన్ అంటూ దిగ్గజ మొబైల్ కంపెనీలకు ముచ్చెమటలు పోయించిన 'రింగింగ్ బెల్స్' కథ కంచికి చేరిందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. రింగింగ్ బెల్స్ సంస్థ వ్యవస్థాపకుడు, ఎండీ మోహిత్ గోయల్ ఆ సంస్థ నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. ఈ సంస్థను అన్నదమ్ములు మోహిత్, అన్‌మోల్ కలసి ప్రారంభించిన సంగతి తెలిసిందే. వారిద్దర మధ్య విభేదాల కారణంగా మోహిత్ తో పాటు సంస్థ సీఈవో, మోహిత్ గోయల్ భార్య ధారణ గోయల్ కూడా రాజీనామా చేసినట్టు సమాచారం.

దీంతో 2016 ఫిబ్రవరిలో మొబైల్ సంస్థల గుండెల్లో గుబులు రేపిన రింగింగ్ బెల్స్ కథ ఏడాది తిరగకుండానే ముగిసిపోయే ప్రమాదంలో పడగా, మోహిత్ సోదరుడు అన్‌మోల్ ప్రస్తుతం కంపెనీ ఇన్‌ చార్జ్‌ గా వ్యవహరిస్తున్నట్టు ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. అశోక్ చద్దా కన్సల్టింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగనున్నట్టు అందులో పేర్కొంది. తమ సంస్థ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయని, స్పష్టమైన వ్యాపార లక్ష్యాలకు కట్టుబడి వున్నామని వ్యవస్థాపక నిర్వాహకుడైన అన్ మోల్ ప్రకటించారు. కాగా, రింగింగ్ బెల్స్ నుంచి రాజీనామా చేసిన మోహిత్ గోయల్ ఎండీఎం ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మరో సంస్థను ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తోంది. 

More Telugu News