: ఓలా యాజమాన్యం వైఖరితో విసుగెత్తిన క్యాబ్ డ్రైవర్లు.. కూకట్ పల్లి ఆఫీసును ధ్వంసం చేసిన వైనం!

హైదరాబాదు శివారు కూకట్ పల్లి ఓలా క్యాబ్ కార్యాలయంపై క్యాబ్ డ్రైవర్లు దాడికి దిగిన ఘటన చోటుచేసుకుంది. ఓలా క్యాబ్స్ ను వివిధ రూపాల్లో పెంచుకుంటూ పోతుండడానికి తోడు, తమకు విధులు అప్పగించడం లేదంటూ డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. మేనేజ్ మెంట్ తో మాట్లాడతామంటూ డ్రైవర్లు కార్యాలయానికి చేరుకున్నారు. అయితే కార్యాలయం బయట యాజమాన్యం నియమించిన బౌన్సర్లు వారిని అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన క్యాబ్ డ్రైవర్లు కార్యాలయంపై దాడికి దిగారు.

ఈ పరిణామంతో కంగారుపడిన ఓలా శాఖ యాజమాన్యం ఆఫీసుకి షట్టర్లు వేసేసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో డ్రైవర్లు మరింత రెచ్చిపోయారు. కాగా, రోజూ 16 ట్రిప్పులు ఇస్తామని, 17వ ట్రిప్పుకు ఇన్సెంటివ్ ఇస్తామని క్యాబ్ పెట్టినప్పుడు చెబుతారని, తాము కళ్లు కాయలు కాచేలా దాని కోసం ఎదురు చూస్తామని, అయితే, పదహారూ ఇచ్చి, ఆ చివరి ట్రిప్పు మాత్రం ఇవ్వరని, దీంతో తమకు ఎదురు చూపులే మిగులుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

తమ సొంత వాహనాలకు ట్రిప్పులు ఇస్తున్నారనీ, తమ కళ్లెదుటే ఆ వాహనాలు మూడు నాలుగు ట్రిప్పులు వేస్తున్నాయని, తాము మాత్రం తిండీ తిప్పలు మాని ఊసురోమంటూ కూర్చుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆఫీసులో ఏదైనా అడిగితే, తమ చేతిలో ఏమీ లేదని, అన్నీ సిస్టం చూసుకుంటుందని అక్కడి ఉద్యోగులు చెబుతారని, సిస్టం చూసుకునేటప్పుడు అసలు ఉద్యోగులు ఎందుకని డ్రైవర్లు ప్రశ్నించారు.  

More Telugu News