: ‘యాపిల్’ అడిగిన ప్రోత్సాహకాలపై చర్చించనున్న మంత్రులు!

దేశంలో ఎలక్ట్రానిక్ పరికరాల దిగుమతులు తగ్గించి, భారత్ లో వాటి తయారీకి అవకాశం కల్పించేందుకుగాను ప్రత్యేక ప్రోత్సాహక ప్యాకేజ్ పథకం ద్వారా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలో భారత్ లో ‘యాపిల్’ సంస్థ ఐఫోన్ తయారీ యూనిట్ ను నెలకొల్పే ఆలోచనలో ఉంది. ఇక్కడ ‘యాపిల్’ సంస్థ ఏర్పాటు చేయాలంటే తమకు ప్రోత్సాహకాలు, మినహాయింపులు ఇవ్వాలని సదరు సంస్థ కోరింది. ఈ విషయమై కేంద్ర మంత్రి వర్గ ఉప సంఘం త్వరలో చర్చించనుంది. ఈ నేపథ్యంలో జనవరి మొదటివారంలో కేంద్ర మంత్రి వర్గ ఉపసంఘం సమావేశం కానుంది. ఈ సమావేశంలో ఆర్థిక, వాణిజ్య, ఇతర మంత్రిత్వ శాఖల సీనియర్ అధికారులు పాల్గొననున్నారు.

దేశంలో తయారీ యూనిట్ నెలకొల్పాలంటే కొన్ని పన్ను మినహాయింపులు, ప్రోత్సాహకాలను యాపిల్ సంస్థ కోరినట్లు ప్రభుత్వ యంత్రాంగం తెలిపింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, యంత్రాలను ఇక్కడికి దిగుమతి చేసుకుంటున్నందున వాటికి మినహాయింపులు ఇవ్వాలని ‘యాపిల్’ కోరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ‘యాపిల్’ కు అమెరికా, జపాన్, కొరియా సహా ఆరు దేశాల్లో తయారీ యూనిట్లు ఉన్నాయి. అమెరికా, చైనా, జర్మనీ, బ్రిటన్ వంటి దేశాల్లో ‘యాపిల్’ సంస్థే స్వయంగా ఐ ఫోన్లను విక్రయిస్తోంది. మన దేశంలో మాత్రం రెడింగ్టన్, ఇన్ గ్రాం మైక్రో వంటి డిస్ట్రిబ్యూటర్ల ద్వారా ఐ ఫోన్ అమ్మకాలు చేపడుతోంది. ఇదిలా ఉండగా, భారత్ లో ఐఫోన్ యూనిట్ నెలకొల్పేందుకు ప్రోత్సాహకాలు ఇవ్వకున్నా యాపిల్ సంస్థ తమ ఐఫోన్ యూనిట్ ను నెలకొల్పగలదని కొన్ని వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

More Telugu News