: చైనాలో టెర్రరిస్ట్ దాడి.. ప్రభుత్వ భవనాలపై ఇస్లామిక్ మిలిటెంట్ల దాడి

చైనాలో ఇస్లామిక్ మిలిటెంట్లు రెచ్చిపోయారు. జింగ్ జియాంగ్ ప్రావిన్స్ లోని కారకక్స్ కౌంటీలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ భవనాలే లక్ష్యంగా ముగ్గురు సాయుధ మిలిటెంట్లు దాడి చేశారు. పేలుడు పదార్థాలు ఉన్న వాహనంతో భవనంపై దాడి చేసి, విస్ఫోటనానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో, ఇద్దరు వ్యక్తులపై కత్తులతో దాడి చేసి, చంపేశారు. అనంతరం పోలీసులు ఎదురుకాల్పులు జరిపి, ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చారు.

చైనాలోని జింగ్ జియాంగ్ ప్రాంతం గత కొన్నేళ్లుగా అల్లకల్లోలంగా మారింది. ఈ ప్రాంతంలో విఘర్ తెగకు చెందిన ముస్లింలు అధికంగా ఉన్నారు. వీరికి, స్థానికంగా ఉన్న హన్ చైనీస్ జాతి ప్రజలకు నిత్యం ఘర్షణలు జరుగుతూనే ఉంటాయి. ఈ ప్రాంతంలో అశాంతికి ఇస్లామిక్ మిలిటెంట్లే కారణమని చైనా ఆరోపిస్తోంది. మరోవైపు, విఘర్ ముస్లింలను, వారి సంస్కృతిని చైనాలోని కమ్యూనిస్ట్ ప్రభుత్వం కఠినంగా అణచివేస్తోందని... అందుకే ఈ ప్రాంతంలో తీవ్ర స్థాయిలో హింస, ప్రతిఘటన పెల్లుబుకుతున్నాయని హక్కుల కార్యకర్తలు అంటున్నారు. అయితే, తాము ఎలాంటి అణచివేత చర్యలకు పాల్పడటం లేదని చైనా ప్రభుత్వం చెబుతోంది.


More Telugu News