kodandaram: అభివృద్ధి జ‌ర‌గాలి.. అయితే ఆ పేరుతో కొంత‌మంది నాశ‌నం కావాల‌నే ధోర‌ణి మాత్రం వ‌ద్దు: కోదండ‌రాం

ఎన్నో పోరాటాల ఫ‌లితంగా ఏర్ప‌డిన తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జ‌ర‌గాల‌ని.. అయితే, అభివృద్ధి పేరుతో కొంత‌మంది నాశ‌నం కావాల‌నే ధోర‌ణి వ‌ద్ద‌ని టీజేఏసీ ఛైర్మ‌న్ ప్రొ.కోదండ‌రాం ప్రభుత్వానికి సూచించారు. పోలీసులు అరెస్టు చేసిన జేఏసీ నాయ‌కుల‌ను విడుద‌ల చేయాలంటూ ఈ రోజు నిరాహార‌ దీక్ష‌కు దిగిన కోదండ‌రాం మీడియాతో మాట్లాడుతూ... నిన్న శాస‌న‌స‌భ‌లో అప్ర‌జాస్వామికంగా భూసేక‌ర‌ణ బిల్లు-2013కు స‌వ‌ర‌ణ‌ చేస్తూ ఆమోదం తెలిపార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. అభివృద్ధి పేరుతో న‌ష్టం క‌లిగించే విధానాల‌కు తాము వ్య‌తిరేక‌మ‌ని ఆయ‌న అన్నారు. 2013 చ‌ట్టం రైతుల‌కు హ‌క్కులు క‌ల్పించిందని, అభివృద్ధికి భూసేక‌ర‌ణ చేయ‌వ‌చ్చు.. కానీ, అవ‌స‌ర‌మైన దాని కంటే ఎక్కువ‌గా భూసేక‌ర‌ణ చేస్తున్నారని ఆయ‌న ఆరోపించారు.

ఇంత విచ్చ‌లవిడిగా భూసేక‌ర‌ణ మంచిదికాదని కోదండరాం అన్నారు. కావల‌సినంత మాత్ర‌మే చేయండని సూచించారు. ప్ర‌భుత్వం మ‌రోసారి ఆలోచించాలని, 2013 చట్టాన్ని అనుసరించాలని ఆయ‌న కోరారు. 2013 బిల్లును స‌వ‌రించ‌డానికి వీలులేదని.. కానీ, చేయొచ్చు అంటూ స‌వ‌ర‌ణ చేశారని ఆయ‌న పేర్కొన్నారు. చ‌ట్టానికి ఇది వ్య‌తిరేక‌మ‌యిన‌దని, భూసేక‌ర‌ణ ప్ర‌క్రియ చ‌ట్టంలో ఉన్న‌ట్లు మాత్రమే య‌థాత‌థంగా జ‌ర‌గాల‌ని బిల్లులో రాసి ఉందని, కానీ నిన్న రాజ్యాంగ విరుద్ధంగా స‌వ‌ర‌ణ‌లు చేశారని ఆయ‌న చెప్పారు. తాము అరాచ‌క శ‌క్తులం కాదని, తాము గొడ‌వ‌లు చేస్తామ‌ని ఆరోపిస్తూ అంద‌రినీ అరెస్టు చేస్తున్నారని ఆయ‌న అన్నారు.

తెలంగాణ ప్ర‌భుత్వానికి మ‌ళ్లీ మ‌ళ్లీ చెబుతున్నాన‌ని,  ప్ర‌భుత్వం త‌మ‌ విన్న‌తిని పరిశీలిస్తుంద‌నే విశ్వాసంతో ఉన్నాన‌ని కోదండరాం అన్నారు. త‌మ చుట్టూ ఎక్క‌డ చూసినా పోలీసులే క‌న‌ప‌డుతున్నారని ఆయ‌న అన్నారు. రేపు అన్ని జిల్లాల క‌లెక్ట‌రేట్ల ముందు ప్ర‌ద‌ర్శ‌న‌లు నిర్వ‌హించి, విన‌తి ప‌త్రాలు స‌మ‌ర్పించాల‌ని ఆయ‌న టీజేఏసీ నాయ‌కుల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు పిలుపునిచ్చారు. టీజేఏసీ నేత‌ల‌ను అరెస్టు చేయాల్సిన అవ‌స‌రం ఏముందని కోదండ‌రాం ప్ర‌శ్నించారు.

More Telugu News