: ఇక నల్లకుబేరులు నిశ్చింతగా ఉండలేరు!: ఐటీ శాఖ హెచ్చరిక

పెద్ద నోట్లను రద్దు చేస్తూ నవంబర్ 8న ప్రకటన వెలువడింది. ప్రకటన తర్వాత తమ వద్ద ఉన్న నల్లధనాన్ని వదిలించుకోవడానికి అనేక మంది బ్యాంకు అకౌంట్లలో డబ్బులు జమ చేశారు. ఈ క్రమంలో, పేద వారి బ్యాంకు ఖాతాలను కూడా వదల్లేదు నల్ల కుబేరులు. సామాన్యుల జన్ ధన్ ఖాతాల్లోకి సైతం తమ డబ్బును డిపాజిట్ చేయించారు. ఈ నేపథ్యంలో, బ్యాంకు అకౌంట్లలోకి వెల్లువెత్తిన నల్లధనంపై ఐటీ శాఖ దృష్టిని సారించింది. అనుమానాస్పద లావాదేవీలు, పరిమితికి మించి డబ్బు జమ కావడంలాంటివి జరిగిన అకౌంట్లను పరిశీలిస్తోంది.

ఢిల్లీలో పలు వ్యాపార సంస్థలు, నిపుణులు, చార్టెడ్ అకౌంటెంట్లతో ఐటీ శాఖ కమిషనర్ ఏకే చౌహాన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పలు అకౌంట్లోలకి లెక్కల్లో చూపని డబ్బును జమ చేసిన వారు... ఇప్పటికైనా 'ప్రధాన మంత్రి గ్రామీణ కల్యాణ్ యోజన (పీఎంజీకేవై)' కింద పన్ను చెల్లించాలని సూచించారు. గడుపు పూర్తయిన తర్వాత తమ విచారణలో ఎవరైనా బయటపడితే... కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆర్థిక ఇంటెలిజెన్స్, ఇతర సంస్థలు ఇస్తున్న డేటాను పూర్తిగా పరిశీలిస్తున్నామని.... నల్లకుబేరులు నిశ్చింతగా ఉండొద్దని హెచ్చరిస్తున్నామని తెలిపారు.

పీఎంజేకేవై పథకం గడువు ముగియక ముందే పన్నులు చెల్లించాలని... ఒకసారి గడువు ముగిస్తే పన్ను ఎగవేతదారులకు కష్టాలు తప్పవని చౌహాన్ హెచ్చరించారు. పీఎంజీకేవై అనేది ఆదాయ వెల్లడి పథకం పార్ట్-2 కాదని... ఈ పథకం ఉద్దేశాలే వేరని చెప్పారు.

More Telugu News