: శశికళ ఎన్నిక ముందు ఏం జరిగింది?

జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే పార్టీలో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. జయ నమ్మినబంటు పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి పదవిని అధిరోహించారు. ఆమె నెచ్చెలి శశికళ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలను స్వీకరించడమే కాక, సీఎం పీఠాన్ని కూడా కైవసం చేసుకోవాలని ఎత్తులు వేశారు. ఈ క్రమంలో, పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికవడం ద్వారా... తన లక్ష్యంలో సగం విజయం సాధించారు ఆమె. ఇక సీఎం కూర్చీలో కూర్చోవడమే ఆమె ఏకైక లక్ష్యం. పార్టీ అధినేత్రిగా పగ్గాలు చేపట్టే క్రమంలో శశికళ వర్గం అనేక జాగ్రత్తలు తీసుకుంది.

ఈ రోజు జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో... శశికళకు ఇబ్బంది కలిగేలా కొంచెం కూడా వ్యతిరేకత కనపడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ భేటీకి 2200 మందిని మాత్రమే ఆహ్వానించారు. శశికళపై వ్యతిరేకత ఉన్నవారికి ఆహ్వానం అందలేదు. వారిని పార్టీ కార్యాలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. కేవలం ఇన్విటేషన్ ఉన్న వారు మాత్రమే పార్టీ కార్యాలయంలోకి వచ్చేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. సమావేశం వేదికపై జయలలిత కోసం ప్రత్యేక కుర్చీని ఏర్పాటు చేశారు. దారిపొడవునా జయలలిత, శశికళ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి పోటీచేస్తానని ఎంపీ శశికళ పుష్ప ప్రకటించడంతో... శశికళ వర్గం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. నిన్న పార్టీ కార్యాలయానికి వచ్చిన శశికళ పుష్ప భర్త లింగేశ్వరన్ తిలకన్ పై శశి వర్గం తీవ్రంగా దాడి చేసింది. రక్తం వచ్చేలా కొట్టి, బయటకు తరిమేసింది. ఈ వ్యవహారంతో, తమ వ్యతిరేక వర్గాలను భయభ్రాంతులకు గురి చేసింది శశి వర్గం. సర్వసభ్య సమావేశం సందర్భంగా కూడా కొంత మేర వాడీవేడిగా సమావేశం జరిగినట్టు సమాచారం. అయినప్పటికీ, శశికళ పార్టీ అధినేత్రిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

More Telugu News