: అంతరిక్ష పరిశోధనల్లో చైనా 2020 విజన్ ఇదే!

1970ల తరువాత కాస్త ఆలస్యంగా అంతరిక్ష రంగంలోకి ప్రవేశించిన చైనా పరిశోధనల్లో మాత్రం దూసుకుపోతోంది. ఈ మేరకు కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకుందని జిన్హువా వార్తా సంస్థ తెలిపింది. భద్రతా కారణాలతో అమెరికా అంతరిక్ష పరిశోధనల సంస్థ నాసా తనను దూరం పెట్టడంతో, 2011 నుంచి చైనా మరింత కసిగా పరిశోధనలు నిర్వహిస్తోంది. దీంతో నాసాతో బంధాలు పునరుద్ధరించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలిపింది. సమీప, దీర్ఘకాలిక భవిష్యత్తులో చేపట్టనున్న ప్రయోగాలకు సంబంధించిన విజన్‌ డాక్యుమెంట్‌ను చైనీస్‌ స్పేస్‌ ఏజెన్సీ వెల్లడించింది. దీనిని చైనా స్పేస్ ఏజెన్సీ విజన్ 2020 గా పేర్కొంది.

దీని వివరాల్లోకి వెళ్తే... 2020 నాటికి అంగారక గ్రహం (మార్స్‌) పైకి సొంత పరిశోధక నౌకను పంపాలని నిర్ణయించింది. మార్స్ పైకి రోవర్‌ ను పంపడమే కాకుండా, ఆ ‌గ్రహం ఉపరితలంలో ఉన్న పదార్థాలపై పరిశోధనలు కూడా చేయనున్నట్లు చైనీస్ స్పేస్‌ ఏజెన్సీ డిప్యూటీ చీఫ్‌ వూ యాన్హువా తెలిపారు. 2018 లోగా చంద్రుడి మీది చీకటి ప్రాంతం (డార్క్ సైడ్ ఆఫ్ ది మూన్) లోకి పరిశోధక నౌకను పంపనున్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే 2030 నాటికి గురుగ్రహం (జుపిటర్‌), దాని ఉపగ్రహాలపైకి కూడా రోవర్లను పంపనున్నట్లు ఆయన చెప్పారు.

ఈ ప్రయోగాలతో రానున్న 15 ఏళ్లలో అంతరిక్ష పరిశోధనల్లో చైనా అగ్రగామిగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 2003లో అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపిన చైనా, చంద్రుడిపైకి పరిశోధక వాహనాన్ని పంపడమే కాకుండా, అక్కడ ల్యాబ్ నిర్మాణం ప్రారంభించింది. ఇది మార్స్ పై ఇల్లు నిర్మించేందుకు ఉపయోగపడుతుందని చైనా భావిస్తోంది. 

More Telugu News