shashikala nataraja: శశికళకు ఆ అర్హతలేదు.. అడ్డుకుంటాం!: వ్యతిరేక వర్గం గరం గరం

జయలలిత కన్నుమూసిన తర్వాత మొదటిసారిగా రేపు తమిళనాడు అధికార పార్టీ అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం జరగనుంది. అయితే, ఈ స‌మావేశంలో శ‌శిక‌ళ‌ను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుంటార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో అదే పార్టీలోని మరో వర్గం ఆమెను వ్య‌తిరేకిస్తోంది. రేపు జ‌ర‌గ‌నున్న ఈ స‌మావేశానికి శశికళ మద్దతుదారులకు మాత్రమే ఆహ్వానాలు పంప‌డంతో ఆహ్వానాలు రాని నేత‌లు గ‌రం గ‌రంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. పార్టీలో ప్రాథమిక సభ్యత్వమే లేని శశికళను ఇప్పుడు ఏకంగా ప్రధాన కార్యదర్శిగా ఎలా ఎన్నుకుంటారని వారు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. 2011 డిసెంబర్‌లో శశికళను అన్నాడీఎంకే పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించారు.

పార్టీ నిబంధ‌న‌ల‌ ప్రకారం ఒక సభ్యునిపై క్రమశిక్షణ చర్య తీసుకుంటే ఐదేళ్లపాటు ఆ సభ్యుడు పోటీ చేయకూడదు. 2012 మార్చిలో శశికళ మళ్లీ జయలలిత వద్దకు చేరినప్పటికీ ఆమెకు ప్రాథమిక సభ్యత్వ కార్డును జారీ చేయలేదు. దీంతో ఆమెను ఎన్నుకోవ‌డం చ‌ట్ట‌వ్య‌తిరేక‌మేన‌ని ఆమె వ్య‌తిరేకులు అంటున్నారు. అంతేగాక వీటిని ప‌ట్టించుకోకుండా శశికళ మాత్రమే ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌దవికి నామినేషన్ వేసేలా పార్టీ పెద్దలు వ్యవహరిస్తే తాము ఎన్నికల కమిషన్‌లో పిటిషన్ వేస్తామని వారు హెచ్చ‌రిక‌లు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

 మ‌రోవైపు జయల‌లిత కోడ‌లు దీపను తెరపైకి తేవాలని పార్టీలోని మ‌రో వర్గం ప్ర‌య‌త్నాలు జరుపుతున్న‌ట్లు తెలుస్తోంది. ఆమెకు స‌భ్య‌త్వాన్ని ఇచ్చే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. త్వరలోనే దీప‌ ప్రధానమంత్రి న‌రేంద్ర‌ మోదీని కలవాల‌ని యోచిస్తున్నారు. దీంతో రేపు జరగనున్న సమావేశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

More Telugu News