: 'దంగల్' సినిమాపై అసంతృప్తిని వ్యక్తం చేసిన ఒరిజినల్ కోచ్.. తన క్యారెక్టర్ ను దెబ్బతీశారని ఆరోపణ!

రెజ్లర్ మహావీర్ సింగ్ ఫొగట్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన అమీర్ ఖాన్ తాజా చిత్రం 'దంగల్' సూపర్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. విమర్శకుల ప్రశంసలను సైతం సొంతం చేసుకుంటోంది. అయితే గీత, బబిత ఫోగట్ ల నిజజీవిత కోచ్ పీఆర్ సోంధీ మాత్రం ఈ సినిమా పట్ల తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. సినిమాలో తన పాత్ర అయిన పీఆర్ కదం క్యారెక్టర్ ను నెగెటివ్ గా చూపించారని సోంధీ మండిపడ్డారు. సోంధీ ప్రస్తుత వయసు 70 ఏళ్లు. కామన్వెల్త్ క్రీడల్లో గీత, బబితలకు జాతీయ కోచ్ గా వ్యవహరించారు. కామన్వెల్త్ లో గీత ఫైనల్ మ్యాచ్ సందర్భంగా, మహావీర్ ను ఓ గదిలో బంధించి, గీత మ్యాచ్ ను చూడకుండా చేసినట్టు సినిమాలో సీన్ ఉంది. ఆ సీన్ గురించి సోధీ అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఓ వ్యక్తిని జాతీయ కోచ్ గదిలో బంధించి ఉంటే దాని గురించి మీడియాకు, పోలీసులకు తెలియకుండా ఉంటుందా? అని సోంధీ ప్రశ్నించారు. ఈ సన్నివేశాన్ని గీత కూడా ఖండిస్తుందని చెప్పారు. మహావీర్ తనకు ఒకప్పటి మిత్రుడేనని... ఇప్పటికీ ఫోగట్ కుటుంబంతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలిపారు. తాను ఇంతవరకు ఈ సినిమా చూడలేదని... అయితే తన పాత్ర ఆధారంగా తీసిన సీన్ల గురించి తన శిష్యులు చెప్పడంతో తాను షాక్ అయ్యానని చెప్పారు. సినిమాకు మసాలా జోడించడానికి మరొకరి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడం కరెక్ట్ కాదని చెప్పారు. ఈ విషయంలో సినీ నిర్మాతపై లీగల్ చర్యలను తీసుకోవాలని భావిస్తున్నానని తెలిపారు. 

More Telugu News