: అమీర్ ఖాన్ కు వ్యతిరేకంగా ఉద్యమించాలని కార్యకర్తలకు బీజేపీ సూచించింది!: పార్టీపై మాజీ ఉద్యోగి ఆరోపణలు

గత సంవత్సరం నవంబరులో దేశంలో అసహనంపై మాట్లాడిన బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ ను ఏకాకిని చేసేలా ఉద్యమించాలని బీజేపీ కార్యకర్తలకు ఐటీ సెల్ చీఫ్ అరవింద్ గుప్తా ఆదేశాలు జారీ చేశారని, అప్పట్లో పార్టీ సోషల్ మీడియా వాలంటీర్ గా పనిచేసిన సాధ్వీ ఖోస్లా సంచలన ఆరోపణలు చేశారు. ఈ-కామర్స్ సంస్థ స్నాప్ డీల్ కు అమీర్ ప్రచారకర్తగా ఉండగా, ఆయన్ను తొలగించేలా సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తూ ఒత్తిడి తేవాలని గుప్తా ఆదేశించినట్టు తాను రాస్తున్న 'ఐ యామ్ ద ట్రోల్' పుస్తకంలో ఆమె రాసుకొచ్చారు.

మోదీ ప్రభుత్వాన్ని అమీర్ విమర్శించడాన్ని బీజేపీ తట్టుకోలేకపోయిందని, ఆయన గురించి ఆన్ లైన్లో ప్రచారం చేయాలని గుప్తా నుంచి తనకు వాట్స్ యాప్ మెసేజ్ వచ్చిందని తెలిపారు. కాగా, ఈ ఆరోపణలను గుప్తా తోసిపుచ్చారు. ఆమె ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నదని ఆరోపించారు. కాగా, 2015 నవంబర్ లో ఈ ఘటనలు జరుగగా, 2016 జనవరి తరువాత అమీర్ ఖాన్ కాంట్రాక్టు ముగియడంతో స్నాప్ డీల్ దాన్ని పొడిగించుకోలేదన్న సంగతి తెలిసిందే.

More Telugu News