: విమానం ఎక్కాలంటే చుక్కలే... పండగ సీజన్ డిమాండ్ తో 65 శాతం పెరిగిన ధరలు!

క్రిస్మస్ - న్యూ ఇయర్ వారంలో తమ స్వస్థలాలకు వెళ్లాలని విమానాలు ఆశ్రయించేవారికి చుక్కలు కనిపిస్తున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే డిమాండ్ అధికంగా ఉండటంతో, ప్రయాణ చార్జీలు 65 శాతం పెరిగాయి. ఆన్ లైన్ ట్రావెల్ పోర్టర్లలోని వివరాల ప్రకారం, 2014 డిసెంబర్ ఆఖరి వారంతో పోలిస్తే 2015 డిసెంబర్ ఆఖరి వారంలో విమాన చార్జీలు 35 నుంచి 40 శాతం పెరిగాయి. ఇప్పుడవి ఆకాశాన్ని తాకాయి. గడచిన మూడేళ్లలో ఏటీఎఫ్ (ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్) ధరలు తగ్గడం, విమాన సర్వీసుల సంఖ్య పెరగడంతో, ధరలు దిగివచ్చినా, పండగల సందర్భాల్లో, పీక్ సీజన్ లో మాత్రం టికెట్ ధరలు అధికంగానే ఉన్నాయని యాత్రా డాట్ కామ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శరత్ ధాల్ వ్యాఖ్యానించారు. లాస్ట్ మినిట్ చార్జీలు సాధారణ రోజులతో పోలిస్తే, కనీసం 20 శాతంగా, గరిష్ఠంగా 65 శాతం వరకూ పెరిగాయని తెలిపారు.

కాగా, ముంబై నుంచి ఢిల్లీ మధ్య తదుపరి అందుబాటులోని విమాన ప్రయాణ చార్జీ రూ. 6 వేలకు పైగానే ఉంది. మేక్ మై ట్రిప్ డాట్ కామ్ లోని అందుబాటులో ఉన్నవివరాల ప్రకారం, నవంబర్ తో పోలిస్తే, డిసెంబరులో 15 శాతం వరకూ టికెట్ ధరలు పెరిగాయి. కోయంబత్తూరు - చెన్నై రూట్ లో అత్యధికంగా 61.5 శాతం మేరకు ధర పెరిగింది. ఆపై ముంబై - చెన్నై, అహ్మదాబాద్ - ఢిల్లీ రూట్లలో టికెట్ల పెరుగుదల అధికంగా ఉంది. ఇదే సమయంలో ప్రయాణికుల సంఖ్య 22 శాతం పెరిగిందని ఎస్ఓటీసీ బిజినెస్ ట్రావెల్ విభాగం సీఈఓ మనోజ్ చాకో వివరించారు. నోట్ల రద్దు తరువాత బుకింగ్స్ కొంత తగ్గి ఆక్యుపెన్సీ రేషియోపై ప్రభావం కనిపిస్తున్నప్పటికీ, ధరలు అధికంగానే ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

More Telugu News