: అయ్య‌ప్ప ఆల‌యంలోకి ఆమె ఎలా ప్ర‌వేశిస్తారో చూస్తాం.. హెచ్చ‌రించిన కేర‌ళ మంత్రి

శ‌బ‌రిమ‌ల ఆల‌యంలోకి తృప్తిదేశాయ్ ప్ర‌వేశాన్ని అడ్డుకుంటామ‌ని కేర‌ళ మంత్రి కాడ‌కాంప‌ల్లి స‌రేంద్ర‌న్ హెచ్చ‌రించారు. భూమాత బ్రిగేడ్ అధ్య‌క్షురాలు అయిన తృప్తిదేశాయ్ మ‌రో వంద మంది మ‌హిళ‌ల‌తో క‌లిసి శ‌బ‌రిమ‌ల ఆల‌యంలోకి ప్ర‌వేశిస్తాన‌ని ప్ర‌క‌టించిన‌ నేప‌థ్యంలో మంత్రి పై విధంగా వ్యాఖ్యానించారు. 10-50 ఏళ్ల వ‌య‌సున్న మ‌హిళ‌ల‌కు ఆల‌యంలోకి ప్ర‌వేశం లేద‌ని ఆయ‌న‌ తేల్చి చెప్పారు. ఇది అంద‌రికీ వ‌ర్తిస్తుంద‌ని, తృప్తిని ఎట్టిప‌రిస్థితుల్లోనూ ఆల‌యంలోకి అనుమ‌తించ‌బోమ‌ని స్ప‌ష్టం చేశారు. అయితే ఆల‌యంలోకి మ‌హిళ‌ల‌ను అనుమ‌తించాలా? వ‌ద్దా? అనే విష‌యాన్ని స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం నిర్ణ‌యిస్తుంద‌ని పేర్కొన్నారు. అప్ప‌టి వ‌ర‌కు ఆల‌య సంప్ర‌దాయాలు, నియ‌మ‌నిబంధ‌న‌ల విష‌యంలో ఎటువంటి మార్పులు ఉండ‌బోవ‌ని తేల్చి చెప్పారు.

శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప ఆల‌యంలోకి మ‌హిళ‌ల‌ను అనుమ‌తించ‌డంపై త‌మ‌కు ఎటువంటి అభ్యంత‌రం లేద‌ని కేర‌ళ ప్ర‌భుత్వం సుప్రీంకోర్టులో అఫిడ‌విట్ దాఖ‌లు చేసిన నేప‌థ్యంలో తృప్తి దేశాయ్.. తాను మ‌రో వంద‌మంది మ‌హిళ‌ల‌తో క‌లిసి ఆల‌యంలోకి ప్ర‌వేశించ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఇప్పుడు ఆమెను అడ్డుకుంటామంటూ స్వ‌యంగా మంత్రి పేర్కొన‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

More Telugu News