rahul gandhi: దొంగల పేర్లను ప్రధాని మోదీ ఎందుకు బయటపెట్టడం లేదు?: రాహుల్ గాంధీ

 ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ మ‌రోసారి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ రోజు రాజస్థాన్ లోని బారాన్‌ లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న‌ రాహుల్ మాట్లాడుతూ... మోదీ మొద‌ట‌ నల్లకుబేరుల జాబితాను పార్లమెంట్ ముందు పెట్టాలని ఆయ‌న అన్నారు. ఎన్నిక‌లకు ముందు మోదీ న‌ల్ల‌ధ‌నంపై ప‌లు వ్యాఖ్య‌లు చేశార‌ని, విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకు వ‌స్తాన‌ని, ఆ డ‌బ్బును పేదలకు పంపిణీ చేస్తామని అన్నార‌ని రాహుల్ పేర్కొన్నారు. ఇప్పుడు ఆ హామీని మోదీ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆయ‌న విమ‌ర్శించారు.

త‌మ దేశంలో ఉన్న భార‌తీయుల బ్యాంకు అకౌంటు వివరాలను స్విస్‌ ప్రభుత్వం కేంద్ర ప్ర‌భుత్వానికి ఇచ్చిందని రాహుల్ అన్నారు. ఆ జాబితాను ప్ర‌ధాని మోదీ పార్లమెంట్‌ లో ఎప్పుడు ప్రవేశపెడతారని ఆయ‌న ప్ర‌శ్నించారు. ప్ర‌ధాని మోదీ సీఎంగా ఉన్న‌ప్పుడు చేసిన‌ అవినీతిపై తాను చేసిన ఆరోపణలపై ఇప్ప‌టివ‌ర‌కు జవాబు చెప్ప‌లేద‌ని రాహుల్ విమ‌ర్శించారు. పెద్ద‌నోట్ల‌ రద్దుపై ప్ర‌ధాని మోదీ మాట్లాడుతూ మొద‌ట తీవ్రవాదాన్ని అంతం చేస్తామని చెప్పార‌ని,  ఇప్పుడు నగదు రహిత ఆర్థికవ్యవస్థ అంటున్నార‌ని ఆయ‌న అన్నారు. పేటీఎం అంటే పే టు మోదీ అని ఆయ‌న అభివ‌ర్ణించారు. 99 శాతం ప్రజల వద్ద బ్లాక్ మ‌నీ లేదని, దేశంలో ఎంతో మంది రైతులు బ‌ల‌వ‌న్మ‌ర‌ణాల‌కు పాల్ప‌డుతున్నా కేంద్ర స‌ర్కారు వారి బాధ‌ల ప‌ట్ల నిర్ల‌క్ష్య ధోర‌ణి ప్ర‌ద‌ర్శిస్తోంద‌ని ఆయ‌న అన్నారు.

More Telugu News