: భర్త బతికి ఉండగా అతని డెత్ సర్టిఫికేట్ తీసుకున్న మహిళ... ఆమెకు మద్దతిస్తున్న గ్రామస్థులు!

ఓపక్క భర్త బతికే ఉండగా అతని డెత్ సర్టిఫికేట్ తీసుకున్న మహిళ, అతనికి సంబంధించిన రెండెకరాల భూమిని అమ్మేసింది. తాను మరణించలేదు, బతికేఉన్నానన్న భర్తపై గ్రామస్థులంతా మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే...అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కంబదూరు మండలం కోటగుడ్డం గ్రామానికి చెందిన గొల్ల బొమ్మయ్య (38) కు కళ్యాణదుర్గం మండలంలోని కాపర్లపల్లికి చెందిన గీతమ్మ (35)కు గతంలో వివాహం జరిగింది. వీరి దాంపత్యానికి గుర్తుగా జీవన్ కుమార్ (16), వాణి (14) పుట్టారు. దంపతుల మధ్య వివాదంతో బొమ్మయ్య చెప్పాపెట్టకుండా 2004లో ఇల్లువిడిచి వెళ్లిపోయాడు. దీంతో అతను వస్తాడని వేచి చూసిన గీతమ్మ అతను రాకపోవడంతో ఏమయ్యాడో తెలియక గ్రామ పంచాయతీకి అదే ఏడాది ఆగస్టు 18న తన భర్త ఆచూకీ తెలియడం లేదని, డెత్ సర్టిఫికేట్ ఇవ్వాలని దరఖాస్తు చేసింది. దీంతో గ్రామకార్యదర్శి ఆమె భర్త డెత్ సర్టిఫికేట్ జారీ చేశారు. దీంతో ఆమె పెన్షన్ కూడా తీసుకుంటోంది.

అనంతరం భర్త పేరుమీదున్న ఆస్తిపాస్తులను తనపేరిట బదిలీ చేయించుకుంది. తరువాత పిల్లల విద్యకోసం ఆమె రెండు ఎకరాల భూమిని అమ్మేసింది. ఈ విషయం తన బంధువుల ద్వారా తెలుసుకుని, నిర్ధారించుకున్న బొమ్మయ్య అకస్మాత్తుగా ఊడిపడి, తన భూమి అమ్మడానికి నువ్వెవరంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో తన భర్త బతికి ఉన్నాడని ఆనంద పడాలో... లేక నిలదీస్తున్నాడని బాధపడాలో తెలియని స్థితిలో గీతమ్మ ఉండగా, తన డెత్ సర్టిఫికేట్ ఇచ్చిన పంచాయతీ కార్యదర్శి, తన భూములు కొనుగోలు చేసిన ఎవరినీ వదిలేదని నేరుగా ఎస్పీ ఆఫీసుకు వెళ్లి బొమ్మయ్య తన భార్యపై ఫిర్యాదు చేశాడు.

 దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు, ఆమె రెండు ఎకరాలు అమ్మింది నిజమేనని నిర్ధారించారు. అయితే అతనిపై అప్పట్లో క్రిమినల్ కేసులున్నాయని వారు గుర్తించారు. దీంతో అతనిపై కేసులు ఓపెన్ చేస్తున్నారు. కాగా, గీతమ్మకు గ్రామస్థులంతా మద్దతుగా నిలుస్తున్నారు. ఇద్దరు పిల్లలు, భార్యను గాలికొదిలేసి వెళ్లిపోయిన భర్త ఉన్నా లేకున్నా ఒకటేనని అభిప్రాయపడుతున్నారు. ఇన్నేళ్ల తరువాత వచ్చి 'నా ఆస్తి అంటే' అంటూ గొడవ చేస్తే సరిపోతుందా? అని వారు ప్రశ్నిస్తున్నారు.

More Telugu News