: టెంకాయలు కొట్టి పోవడం తప్ప డబ్బులెప్పుడైనా ఇచ్చారా?: చంద్రబాబుపై జగన్ నిప్పులు

ఎన్నికలు జరిగే సమయంలో వచ్చి, తనకు ఓట్లు కావాలని అడుగుతూ, పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలంటూ టెంకాయలు కొట్టి పోవడం తప్ప, చంద్రబాబునాయుడు వాటి నిర్మాణానికి డబ్బులు ఎప్పుడైనా ఇచ్చారా? అని వైకాపా అధినేత వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. ఈ ఉదయం పులివెందులలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట జరిగిన రైతు మహాధర్నాలో జగన్ పాల్గొని అసంఖ్యాకంగా హాజరైన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆనాడు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న ఇదే చంద్రబాబునాయుడు, గాలేరు నగరి ప్రాజెక్టుకు కేవలం రూ. 13 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు.

హంద్రీనీవా ప్రాజెక్టుకు ముష్టి వేసినట్టుగా రూ. 17 కోట్లు ఇచ్చారని అన్నారు. ఆపై దివంగత నేత వైఎస్ సీఎం అయిన తరువాతనే ప్రాజెక్టులకు నిధులు పెరిగి పనులు వేగవంతమయ్యాయని చెప్పారు. రాయలసీమ దశ, దిశను మార్చేలా హంద్రీనీవాకు రూ. 4 వేల కోట్లు, గాలేరు నగరికి దాదాపు రూ. 4 వేల కోట్లు మంజూరు చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు తిరిగొచ్చిన చంద్రబాబు ఆ ప్రాజెక్టులను తానే కట్టించినట్టు పోజు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వైకాపా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రైతులు పాల్గొన్నారు.

More Telugu News