: జనవరి 1 తర్వాత వారికి కష్టాలు మొదలవుతాయి: వెంకయ్యనాయుడు

జనవరి 1 తర్వాత అవినీతి పరులకు కష్టాలు మొదలవుతాయని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు.  మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి 92వ పుట్టినరోజు సందర్భంగా విజయవాడలో ఏర్పాటు చేసిన ‘సుపరిపాలనా దినం’ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, పెద్దనోట్ల రద్దు తర్వాత డబ్బంతా బ్యాంకుల్లోకి వచ్చిందని చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని, పెద్దనోట్ల రద్దు ద్వారా ప్రజలను కష్టపెట్టాలన్నది ప్రభుత్వం ఉద్దేశం కాదని అన్నారు.

జనవరి 1 తర్వాత నీతి పరులకు కష్టాలు తొలగనున్నాయని, అదే సమయంలో అవినీతిపరులకు కష్టాలు మొదలవుతాయని అన్నారు. నోట్ల రద్దు అనంతరం, జమ్మూకాశ్మీర్ లో రాళ్లు రువ్వే కార్యక్రమం, మాదక ద్రవ్యాల రవాణా, ఉగ్రవాదుల చొరబాట్లు ఆగిపోయాయన్నారు. అంబానీ, ఆదానీలకు మోదీ ప్రభుత్వం లాభం చేకూరుస్తోందనేది తప్పుడు ప్రచారమని అన్నారు. అంబానీ, అదానీలకు కాంగ్రెస్ పార్టీ హయాంలో లక్షా 80 వేల కోట్ల రూపాయలు అప్పుగా ఇచ్చారని అన్నారు. వాజ్ పేయి హయాంలో ప్రభుత్వ పథకాలు సజావుగా అందాయని అన్నారు. ప్రతి ఇంట్లో టెలిఫోన్, ప్రతి గ్రామానికి రోడ్డు, జాతీయ రహదారుల అనుసంధానం.. మొదలైనవన్నీ వాజ్ పేయి హయాంలోనే వేగంగా జరిగాయన్నారు.

More Telugu News