: భారత్ లో మరింత దిగజారనున్న బంగారం ధరలు

రోజురోజుకీ దిగుతూ వ‌స్తోన్న‌ ప‌సిడిధ‌ర మ‌రింత దిగ‌జారే అవ‌కాశం ఉన్న‌ట్లు నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో మార్కెట్లో పదిగ్రాముల బంగారం ధ‌ర‌ రూ.26 వేలకు దిగువకు చేరుతుందేమోన‌ని అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. ఇటీవల ప‌సిడిధ‌ర‌ సాంకేతికంగా కీలకమైన 28 వేల క‌న్నా దిగ‌జారిన సంగ‌తి తెలిసిందే. ఏ మాత్రం కోలుకోని బులియ‌న్ మార్కెట్ మ‌రింతగా మార్కెట్ వ‌ర్గాల్లో ఆందోళ‌న క‌లిగిస్తోంది.

మ‌రోవైపు ఎంసీఎక్స్ మార్కెట్ లో నిన్న‌ రూ.27వేల దిగువకు ఇది పడడంతో విశ్లేష‌కుల అంచనాలకు మరింత బలాన్ని చేకూర్చుతోంది. నిన్నటి వాణిజ్యంలో బంగారం ధరలు రూ. 26910 కనిష్ట స్థాయిని న‌మోదు చేసుకున్నాయి. అయితే, అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం పసిడి ధరల పతనానికి కొద్దిగా బ్రేక్ పడింది. కాగా, దేశీయ మార్కెట్లో మాత్రం ప‌సిడి ధరల ప‌త‌నం అలాగే కొనసాగుతోంది. దీంతో మార్కెట్లో ఈ రోజు బంగారం ధర మరో 50 రూపాయ‌లు త‌గ్గింది.

ప్ర‌స్తుతం పది గ్రాముల ప‌సిడి ధ‌ర‌ 27,800 గా ఉంది. మరోవైపు వెండి ధ‌ర‌ కిలో రూ.38,810గా ఉంది. అంత‌ర్జాతీయ మార్కెట్ లో నెలకొన్న ప‌రిస్థితులు భార‌త్‌లో ప‌సిడి ధరలు ప‌డిపోవ‌డానికి కార‌ణ‌మ‌వుతున్నాయ‌ని నిపుణులు చెబుతున్నారు. దేశంలో రీటైల్ డిమాండ్ క్షీణించడం, పెద్దనోట్ల రద్దు కూడా ప‌సిడి ధ‌ర‌లు ప‌డిపోవ‌డానికి కార‌ణ‌మ‌వుతున్నాయ‌ని భావిస్తున్నారు. కాగా, రెండు రోజుల్లో 100 రూపాయ‌లు క్షీణించి ఢిల్లీలో 99.9 శాతం స్వ‌చ్ఛ‌మైన బంగారం  ధ‌ర 27,800 గా ఉంటే, 99.5 శాతం స్వచ్ఛమైన ప‌సిడి ధర రూ. 27,650 గా ఉంది. సావరీన్ గోల్డ్ మాత్రం ఎనిమిది గ్రాములు రూ.24,000గా కొన‌సాగుతోంది.

More Telugu News