: తెలంగాణలో మరో రెండు వారాల పాటు చలి తీవ్రత

హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా వచ్చే రెండు వారాల పాటు చలి ఉద్ధృతంగానే ఉంటుందని వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం తెలిపింది. ఉత్తరభారతం నుంచి వీస్తున్న పొడి గాలులతో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయని పేర్కొంది. పడిపోయిన ఉష్ణోగ్రతల కారణంగా రాత్రి వేళల్లో పెరిగిన చలి తీవ్రతకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఈ గాలులు ఇలానే కొనసాగితే జనవరి మొదటి వారం వరకు చలి ఉద్ధృతి మరింత ఉంటుందని స్పష్టం చేసింది. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఒకటి నుంచి ఆరు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్ లో కనిష్ట ఉష్ణోగ్రత 11.9 డిగ్రీలుగా ఉందని, ఇది సాధారణం కంటే మూడు డిగ్రీలు తక్కువ అని తెలిపింది. ఆదిలాబాద్ లో అతి తక్కువ ఆరు డిగ్రీలే ఉన్నట్టు పేర్కొంది. ఖమ్మంలో రికార్డు స్థాయిలో సాధారణం కంటే ఆరు డిగ్రీలు తక్కువగా 11 డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోయినట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. 

More Telugu News