: అమెరికన్ల ఉద్యోగాలకూ గండం తప్పదట!

అమెరికాలో ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికలలో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో అక్రమ వలసదారులను తమ దేశం నుంచి వెనక్కి పంపించేసి, స్థానిక అమెరికన్లకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని హామీలు గుప్పించారు. అయితే, ఇప్పుడు అమెరికాలో పనిచేస్తున్న స్థానిక అమెరికన్ల ఉద్యోగాలు ప్రమాదంలో పడనున్నాయి. ఎందుకంటే, ఆటోమేషన్ (యాంత్రీకరణ) పద్ధతిని అమలు చేసే ఆలోచనలో పలు కంపెనీలు ఉన్నాయని ఆర్థిక రంగ నిపుణులు అంటున్నారు.

ప్రపంచీకరణ వల్ల పోయిన ఉద్యోగాల సంఖ్య కన్నా ఆటోమేషన్  వల్ల పోయే ఉద్యోగాలు ఎక్కువని వారు హెచ్చరిస్తున్నారు. ఆటోమేషన్ విధానం కనుక పూర్తి స్థాయిలోఅమల్లోకి వస్తే మనుషులు చేస్తున్న పనులను ఇకపై కంప్యూటర్లు, రోబోలు చేస్తాయి. దీంతో, ఉన్న ఉద్యోగాలు పోవడమే కాకుండా, కొత్త ఉద్యోగాలు పుట్టవని మ్యాక్ కిన్ సే, డరాన్ ఏస్ మొగ్గూ, డేవిడ్ ఆటర్ లాంటి ఆర్థిక నిపుణులు అంటున్నారు.

ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, దేశీయ ఉద్యోగాలు మెక్సికోకు తరలిపోకుండా ఉండేందుకు అమెరికాలోని యునైటైడ్ టెక్నాలజీస్ కంపెనీతో ట్రంప్ ఇటీవల ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందంలో భాగంగా కంపెనీ 160 లక్షల డాలర్లను అదనంగా పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించింది. ఆ పెట్టుబడులలో ఎక్కువ నిధులను ఆటోమేషన్ కోసమే సదరు కంపెనీ వెచ్చించనుందని సమాచారం.

 కాగా,ఆటోమేషన్ కారణంగా 1962 నుంచి 2005 వరకు అమెరికా ఉక్కు రంగంలో సుమారు నాలుగు లక్షల ఉద్యోగాలు పోయాయని, కార్మికుల సంఖ్య 75 శాతం తగ్గిందన్న విషయం అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. ప్రపంచీకరణ నేపథ్యంలో చైనాతో వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడం వల్ల పలు దేశాల్లో ఉద్యోగాలు కోల్పోయిన కార్మికుల సంఖ్య 20 లక్షల నుంచి 24 లక్షల వరకు ఉండవచ్చని ఆర్థిక నిపుణుల అంచనాగా ఉంది.

More Telugu News