: నోట్ల రద్దు కష్టం: కుదేలైన టూరిజం రంగం.. 5 కోట్ల మంది జీవనం అస్తవ్యస్తం

ఉత్తర గోవాలో రాజూ లఖానీ నడుపుకుంటున్న బీచ్ సైడ్ రెస్టారెంట్. నిత్యమూ సాయంత్రమయ్యే సరికి టూరిస్టులతో కిటకిటలాడిపోతుంటుంది. నెలన్నర రోజుల క్రితం వరకూ ఓ వెలుగు వెలిగిన ఈ రెస్టారెంట్ ఇప్పుడు బోసి పోయింది. "మాకిప్పుడు కస్టమర్లు లేరు. నోట్ల రద్దు తరువాత గోవా నుంచి 90 శాతం మంది టూరిస్టులు వెళ్లిపోయారు. నా దగ్గర పనిచేస్తున్న ఉద్యోగులను సైతం తొలగించక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది" అని రాజు వాపోయాడు.

ఇది ఒక్క రాజు సమస్య మాత్రమే కాదు. నోట్ల రద్దు తరువాత దెబ్బతిన్న రంగాల్లో భారత్ టూరిజం కూడా ఉంది. ప్రపంచ టూరిజం ఇండస్ట్రీ వృద్ధి 2.3 శాతంతో పోలిస్తే, మెరుగ్గా 2.8 శాతం వృద్ధిని నమోదు చేస్తూ వచ్చిన భారత పర్యాటక రంగం, నవంబర్ తరువాత కుదేలైంది. వాస్తవానికి దేశ స్థూల జాతీయోత్పత్తిలో టూరిజం వాటా 6.3 శాతం. వరల్డ్ ట్రేడ్ అండ్ టూరిజం కౌన్సిల్ ఇటీవలి నివేదిక ప్రకారం 2015లో ఈ రంగం నుంచి ఇండియాకు రూ. 8.3 లక్షల కోట్ల ఆదాయం లభించింది. ప్రతి పది లక్షల రూపాయల ఆదాయంపై 78 మంది టూరిస్టుల నుంచి వచ్చే ఆదాయంపైనే జీవనం సాగిస్తున్నారు.

 ఇదే పెట్టుబడిపై వ్యవసాయ రంగంలో 45 మంది, ఉత్పత్తి రంగంలో 18 మంది మాత్రమే బతుకుతున్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2009 నుంచి ప్రతియేటా టూరిజం ఆధారిత ఉపాధి 10 శాతం చొప్పున పెరుగుతూ వస్తుండగా, ప్రస్తుతం 5 కోట్ల మందికి పైగా ఉపాధిని పొందుతున్నారు. అంటే, కంబోడియా జనాభాతో పోలిస్తే, అంతకన్నా ఎక్కువ మంది భారతీయులు పర్యాటకులపై ఆదారపడివున్నారు.

ఇక 2015లో ఇండియాకు 80 లక్షల మంది విదేశీ అతిధులు వచ్చినట్టు టూరిజం మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. రూ. 500, రూ. 1000 నోట్ల రద్దు తరువాత, కొత్త నోట్ల లభ్యత విదేశీయులకు అతి తక్కువగా ఉండటంతో, ఆ ప్రభావం టూరిస్టు రాష్ట్రాలుగా పేరు తెచ్చుకున్న కేరళ, కర్ణాటకలపై అధికంగా కనిపిస్తోంది. ఈ రాష్ట్రాలకు వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. ఇక డబ్బు కోసం క్యూ-లైన్లలో నిలబడాలంటే, విదేశీయులు వణికి పోతున్నారు. ప్రస్తుతం టూరిజంపై ఆధారపడి జీవనం గడుపుతున్న వారంతా ఇబ్బందులను ఎదుర్కొంటుండగా, పరిస్థితి త్వరలోనే చక్కబడుతుందని చెప్పడం మినహా, ప్రభుత్వ పెద్దల నుంచి మరే విధమైన స్పందనా కనిపించడం లేదన్న విమర్శలూ పెరుగుతున్నాయి.

More Telugu News