: 'ఉచితం' పోతే రిలయన్స్ జియో పరిస్థితి మారుతుంది!: 'ఫిచ్' రేటింగ్స్

ఉచిత వాయిస్ కాల్స్, డేటా ఆఫర్లతో దూసుకెళ్తూ, మార్చి 2017 నాటికి 10 కోట్ల మంది వినియోగదారులకు చేరువ అవుతుందని భావిస్తున్న రిలయన్స్ జియోపై రీసెర్చ్ అండ్ రేటింగ్స్ సంస్థ 'ఫిచ్' ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఉచితం అనే ఆఫర్ తొలగిపోయిన తరువాత, సంస్థ కస్టమర్ల సంఖ్య కూడా గణనీయంగా తగ్గి వస్తుందని, ఇతర టాప్ కంపెనీల కన్నా దిగువకు వినియోగదారుల సంఖ్య పడిపోవచ్చని ఫిచ్ రేటింగ్స్ డైరెక్టర్ నితిన్ సోనీ వ్యాఖ్యానించారు.

"ప్రస్తుతం ఉచిత కాల్స్, ఆఫర్లతో వ్యూహాత్మకంగా రిలయన్స్ జియో సాగుతోంది. మార్చి వరకూ వినియోగదారుల సంఖ్య పెరుగుతుంది. ప్రస్తుతం 5.5 కోట్ల మంది వరకూ వినియోగదారులు ఉన్నారు. ఈ సంఖ్య మరో 5 కోట్లు పెరగొచ్చు. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇవన్నీ ఉచిత సేవలు. అందుకే కస్టమర్ల సంఖ్య పెరుగుతోంది" అని అన్నారు.

ప్రస్తుతం ఎయిర్ టెల్, ఐడియా సేవలను వినియోగిస్తున్న వారు, రెండో సిమ్ గా రిలయన్స్ జియోను తీసుకుని ఉచిత ఆఫర్లు వాడుతున్నారని, ఒకసారి డబ్బు చెల్లించాలని చెప్పిన తరవాత, వీరిలో అత్యధికులు జియో సిమ్ లను పక్కన పెట్టవచ్చని అభిప్రాయపడ్డారు. ఏప్రిల్ 1నే రిలయన్స్ కస్టమర్ల సంఖ్య 10 శాతం తగ్గుతుందని భావిస్తున్నట్టు తెలిపారు.

More Telugu News