: జాబ్ మేళాల లెక్క‌లు తీయండి.. స‌క్సెస్ రేటెంతో చూడండి.. చంద్ర‌బాబు ఆదేశం

నిరుద్యోగుల కోసం జాబ్‌మేళాలు నిర్వ‌హిస్తే స‌రిపోద‌ని, వాటిలో స‌క్సెస్ రేటెంతో చూడాల‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అన్నారు. గురువారం క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో మాట్లాడిన సీఎం  ఇప్ప‌టి వ‌ర‌కు నిర్వ‌హించిన జాబ్ మేళాల‌కు పెట్టిన ఖ‌ర్చు ఎంత‌? ఎంత‌మందికి ఉద్యోగాలు వ‌చ్చాయి? అనే వివ‌రాలు సేక‌రించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఏ కార్య‌క్ర‌మం చేప‌ప‌ట్టినా అందులో స‌క్సెస్ రేటెంతో చూడాల‌ని సూచించారు. సంప‌ద సృష్టించ‌కుండా నిధులు ఖ‌ర్చు చేయ‌డం స‌రికాద‌ని అన్నారు. విద్యార్థుల‌కు ఉద్దేశించిన సంక్షేమ ప‌థ‌కాల విష‌యంలో చేసే ఖ‌ర్చులు సొంత పిల్ల‌ల‌పై చేసే ఖ‌ర్చుల్లా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని అధికారులకు సూచించారు.

భార్య‌భ‌ర్త‌లిద్ద‌రికీ 80 శాతానికి పైగా అంగ‌వైక‌ల్యం ఉంటే ఒక‌రికి ఉద్యోగం ఇచ్చేలా మార్గ‌ద‌ర్శ‌కాలు రూపొందించాల‌ని అధికారుల‌ను ముఖ్య‌మంత్రి ఆదేశించారు. అంతేకాదు దీనిని క‌చ్చితంగా అమ‌లు చేయాల్సిందేన‌ని అన్నారు. పింఛ‌న్ల పంపిణీపై 53 శాతం మంది ల‌బ్ధిదారులు మాత్ర‌మే సంతృప్తిగా ఉన్నార‌ని, ఆ స్థాయి పెర‌గాల‌ని పేర్కొన్నారు. క‌ర్నూలు జిల్లా పెద‌పాడులో ఎయిడ్స్ వ్యాధితో త‌ల్లిదండ్రులు చ‌నిపోవ‌డంతో అనాథ‌లుగా మారిన చిన్నారుల‌ను ఆదుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్‌ను చంద్ర‌బాబు ఆదేశించారు. అయితే వారిని ఇప్ప‌టికే హాస్ట‌ల్‌లో చేర్పించామ‌ని క‌లెక్ట‌ర్ ముఖ్య‌మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీనికి స్పందించిన బాబు వారిని చూసుకునేందుకు ప్ర‌త్యేకంగా ఒక‌రిని నియ‌మించ‌డంతోపాటు ఒక్కొక్క‌రి పేరుపైనా రూ.ల‌క్ష ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాల‌ని క‌లెక్ట‌ర్‌ను ఆదేశించారు. అలాగే ట‌ర్కీలో చిక్కుకుపోయిన విజ‌య‌న‌గ‌రం వాసుల‌ను తిరిగి స్వ‌దేశానికి రప్పించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశాలు జారీ చేశారు.

More Telugu News