: చైనాకు మరోసారి షాకిచ్చిన ట్రంప్

అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాకు మరోసారి షాకిచ్చారు. అధ్యక్షుడిగా విజయం సాధించిన వెంటనే తైవాన్ అధ్యక్షురాలితో మాట్లాడి చైనాకు ఆగ్రహం తెప్పించిన ట్రంప్ ఈ సారి చైనాను తీవ్రంగా వ్యతిరేకించే ఆర్థికవేత్త పీటర్ నెవారోను తన సలహాదారుగా నియమించుకున్నారు. కీలక విధాన నిర్ణయాలకు ఉద్దేశించిన వైట్ హౌస్ జాతీయ వాణిజ్య మండలి అధ్యక్షుడిగా ఆయనను ట్రంప్ నియమించారు. విద్యావేత్త అయిన నెవారో వన్ టైమ్ ఇన్వెస్టిమెంట్ అడ్వైజర్ గా కూడా పనిచేశారు. చైనాతో అమెరికాకు పొంచి ఉన్న ముప్పు గురించి ఆయన ఎన్నో పుస్తకాలు రాశారు.

ఆసియాలో అతిపెద్ద ఆధిపత్య, సైనిక శక్తిగా ఎదిగేందుకు చైనా తీవ్రంగా ప్రయత్నిస్తోందని, దానితో అమెరికాకు ముప్పు పొంచి ఉందని ఆయన చాలా సార్లు హెచ్చరించారు. కాలిఫోర్నియా, ఇర్విన్ యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ గా పని చేసిన నెవారో మంచి ఆర్థిక దార్శనికుడని, దేశ వ్యాపార వాణిజ్యాలు క్షీణించకుండా, ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందేలా, ఉద్యోగాలు విదేశాలకు తరలిపోకుండా విధాన రూపకల్పనతో తోడ్పాటునందిస్తారని ట్రంప్ టీం ఆశాభావం వ్యక్తం చేసింది. దీంతో చైనాపై తన వైఖరిని ట్రంప్ మరోసారి స్పష్టం చేసినట్టైంది. 

More Telugu News