china: చైనా భూభాగం పేరును తప్పుగా పేర్కొన్న కర్ణాటక సీఎం కార్యాలయం.. నెటిజన్ల మండిపాటు!

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కార్యాలయం సిబ్బంది ఇటీవ‌ల ట్విట్ట‌ర్‌లో చేసిన ఓ ట్వీట్‌పై నెటిజ‌న్లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. చైనాకు చెందిన ఓ ప్రతినిధి బృందం ఇటీవ‌ల క‌ర్ణాట‌క‌కు వచ్చి సిద్ధ‌రామ‌య్య‌తో భేటీ అయింది. వారు సిద్ధ‌రామ‌య్య‌తో బెంగళూరు అభివృద్ధితో పాటు ప‌లు విషయాల గురించి మాట్లాడారు. ఈ విష‌యాన్ని తెలుపుతూ సిద్ధ‌రామ‌య్య పేరుతో ఆయన కార్యాలయ సిబ్బంది ట్విట్ట‌ర్‌లో ట్వీట్ చేస్తూ చైనాలోని సియాచిన్‌ ప్రావిన్స్‌ నుంచి లీ జోంగ్‌ సారథ్యంలో వచ్చిన టీమ్‌తో సిద్ధ‌రామయ్య భేటీ అయ్యార‌ని పేర్కొన్నారు.

అయితే, సియాచిన్ ప్రాంతం వాస్తవాధీన రేఖ వద్ద భారత భూభాగంలో ఉన్న‌ హిమాలయ పర్వత శ్రేణి. చైనాలో ఉన్న ప్రాంతం పేరు సిచువాన్‌. భారత భూభాగం వైపుకు దూసుకురావాల‌ని చూస్తోన్న చైనా వ్య‌వ‌హార తీరుతో ముందే విసుగెత్తి ఉన్న భార‌త నెటిజ‌న్లు సిద్ధ‌రామ‌య్య పేరుతో చేసిన ఈ ట్వీట్‌పై మరింత మండిప‌డుతున్నారు. ఆ ట్వీటు సియాచిన్‌ ప్రాంతం చైనాలో ఉన్నట్టుగా అర్థం వ‌చ్చేలా ఉంద‌ని విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. సిద్ధ‌రామ‌య్య‌కు సియాచిన్‌కు, సిచువాన్‌కు మ‌ధ్య ఉన్న తేడా చెప్పేవారు ఒక్క‌రు కూడా లేరా? అంటూ కామెంట్లు పెడుతున్నారు.

More Telugu News