: మెల్లగా మారుతున్న ఇండియాపై ఎందుకీ బలవంతపు 'నగదు రహితం'?

ఓ రైల్వే రిజర్వేషన్ టికెట్ ను కొనుగోలు చేసేందుకు మీరు చివరి సారిగా ఎప్పుడు క్యూలైన్లో నిలుచున్నారు? ఓ మల్టీ ప్లెక్స్ లో తొలిరోజు సినిమా చూసేందుకు టికెట్ల కోసం తోపులాటతో నిండిన అభిమానుల వరుసలో ఎప్పుడు నిలబడ్డారు? ఓ విమానం టికెట్ ను ఎయిర్ లైన్స్ ఆఫీసుకు వెళ్లి ఎప్పుడు కొన్నారు? ఇది చదువుతున్న వారిలో 100 శాతం మందికి కాకపోయినా, చాలా మందికి ఈ ప్రశ్నలకు సమాధానం లభించడం కష్టం. గత పదేళ్ల నుంచి, అందునా ఐదారేళ్లుగా భారత ప్రజలు, ముఖ్యంగా యువత డిజిటల్ లావాదేవీలవైపు మొగ్గు చూపుతూ, నగదు రహిత లావాదేవీలను జరుపుతూ ఉండటమే ఇందుకు కారణం.

2000 ప్రారంభంతో పోలిస్తే, ఈ ఆరేళ్లలో డిజిటల్ లావాదేవీల సంఖ్య ఎంతో పెరిగింది. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి సంస్థలు గ్రామీణ, చిన్న పట్టణాల మార్కెట్ కు కూడా విస్తరించాయి. పల్లెల్లో సైతం స్మార్ట్ ఫోన్లు చేతబట్టుకుని, తమకు నచ్చిన ప్రొడక్టులను ఇంటికే తెప్పించుకుంటున్నారు. అందివస్తున్న అధునాతన సాంకేతికత అందరికీ దగ్గరవుతోంది. భారతావని డిజిటల్ దిశగా మారుతోందని స్పష్టంగా చెప్పేందుకు ఈ సంకేతం చాలు.

వాస్తవానికి ఇప్పటికీ 30 శాతానికి పైగా భారతావనికి కనీసం 15 కిలోమీటర్ల పరిధిలో ఒక్క బ్యాంకు శాఖ కూడా లేని పరిస్థితి. బ్యాంకు ఖాతాల సంఖ్య పరంగా కళ్లకు కనిపిస్తున్నన్ని ఎకౌంట్లు, వాస్తవ పరిస్థితుల్లో క్రియాశీలకంగా లేవు. ఇండియాలో ఇప్పటికీ 50 నుంచి 60 కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు లేవు. ఈ నేపథ్యంలో నోట్ల రద్దును తెరపైకి తెచ్చి, ఆ తరువాత నగదు రహిత భారతావనిని నిర్మించాలని కేంద్రం చేస్తున్న ప్రయత్నం, ప్రజలపై బలవంతంగా 'డిజిటల్ క్యాష్'ను రుద్దాలని చూడటం ఏ మాత్రం శ్రేయస్కరం కాదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నిదానంగా ప్రజలు నగదు రహిత లావాదేవీలకు దగ్గరవుతున్నారని ఎంతో స్పష్టంగా వెల్లడవుతున్న భారతావనిలో బలవంతంగా నిర్ణయాలు తీసుకుంటే, అది ఎకానమీని తీవ్రంగా దెబ్బతీస్తుందని, పాలకుల పట్ల వ్యతిరేకతను పెంచుతుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇక సైబర్ భద్రత ఇక్కడ మరో ముఖ్యాంశం. ఈ సంవత్సరం బ్యాంకు ఖాతాల వివరాలను ఏటీఎంల నుంచి సేకరించిన హ్యాకర్లు ఎంత పని చేశారో అందరికీ తెలిసిందే. లక్షల కొద్దీ బ్యాంకు ఖాతాదారుల ఏటీఎం కార్డులను, పిన్ నంబర్లను మార్చాల్సి వచ్చింది. క్యాష్ లెస్ ఎకానమీలో డిజిటల్ లావాదేవీలకు థర్డ్ పార్టీ గేట్ వే సేవలందిస్తున్న వెబ్ సైట్ల ను హ్యాకర్లు తమ చేతుల్లోకి తీసుకుంటే, జరిగే అనర్థం దేశాభివృద్ధిని ఎన్నో ఏళ్ల వెనక్కు నెట్టేస్తుంది.

ఇండియాలో బ్యాంకు చెల్లింపు సేవలందిస్తున్న కంపెనీల్లో వీసా, మాస్టర్ కార్డ్ వంటి ప్రధాన కంపెనీలున్నాయి. ఇక మొబైల్ పేమెంట్ చెల్లింపుల సంస్థలుగా పేటీఎం వంటి కంపెనీలు సేవలందిస్తున్నాయి. ఈ కంపెనీల సర్వర్లు హ్యాక్ చేయబడితే... స్వల్ప కాల వ్యవధిలో బలవంతంగా క్యాష్ లెస్ ఎకానమీని నెలకొల్పాలని చేసే ప్రయత్నం కచ్ఛితంగా విఫలమవుతుంది. ఇక ఒకసారి ప్రజలకు ఆగ్రహావేశాలు కలిగితే...?

ఇండియాను అవినీతి, లంచగొండితనం రహితంగా మార్చేందుకు కేంద్రం తీసుకున్న చర్యే పెద్ద నోట్ల రద్దు అని అత్యధిక భారతీయులు నమ్మినందునే, బ్యాంకుల వద్ద, ఏటీఎంల వద్ద 44 రోజులుగా క్యూలైన్లలో ఓపికగా నిలబడుతున్నారు. ప్రతి ఉద్యోగీ నెలసరి దైనందిన ఖర్చులకు డబ్బు కోసం రెండు నుంచి మూడు పనిదినాలను పోగొట్టుకున్న పరిస్థితి. ఇలా ఎన్ని నెలలు ఓపికగా ఎదురుచూస్తాం? మోదీ చెప్పినట్టు 50 రోజుల్లో సమస్య తీరిపోతుందని ఇప్పుడు నమ్మలేని పరిస్థితి.

డిజిటల్ మనీ గురించి, ఆ విధానంలో అందే ప్రయోజనాల గురించి మనకందరికీ తెలుసు, అయితే, డిజిటల్ ఇండియాను సృష్టించడంలో ఎంచుకున్న మార్గంపై మాత్రం న్యూఢిల్లీ పాలకులు మరోసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నది ఆర్థిక నిపుణుల అభిప్రాయం. మరింత ప్రణాళిక, దాని అమలు ద్వారానే నోట్ల రద్దు, డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని ఆశిద్దాం.

More Telugu News