: మిస్త్రీకి మద్దతు పలికిన నస్లీ వాడియాకు ఉద్వాసన పలికిన టాటా స్టీల్ ఇన్వెస్టర్లు

టాటా సన్స్ నుంచి తొలగించిన సైరస్ మిస్త్రీకి అండగా నిలుస్తున్న ఆయన మిత్రుడు, టాటా స్టీల్ లో ఇండిపెండెంట్ డైరెక్టరుగా ఉన్న నస్లీ వాడియాను తొలగించాలని తీసుకున్న నిర్ణయానికి అత్యధిక షేర్ హోల్డర్లు ఆమోదం పలికారు. ఈ ఉదయం టాటా స్టీల్ అసాధారణ సర్వసభ్య సమావేశం జరుగగా, స్వతంత్ర డైరెక్టర్ గా ఉన్న నస్లీని తొలగించాలని 90 శాతం మంది వాటాదారులు ఓటేసినట్టు బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ రెగ్యులేటరీకి పంపిన ఫైలింగ్ లో టాటా స్టీల్ వెల్లడించింది.

కాగా, తనకు వ్యతిరేకంగా జరుగుతున్న ఓటింగ్ కావడంతో ఈ సమావేశానికి నస్లీ వాడియా హాజరు కాలేదు. గడచిన 37 ఏళ్లుగా నస్లీ వాడియా టాటా స్టీల్ లో స్వతంత్ర డైరెక్టర్గా ఉన్న సంగతి తెలిసిందే. సైరస్ మిస్త్రీ గెంటివేత తరువాత, ఆయనకు మద్దతుగా నిలిచిన నస్లీ, టాటా సన్స్ పై, రతన్ టాటాపై పలు విమర్శలు చేశారు. తనను తొలగించే సత్తా టాటా సన్స్ కు లేదని, వీలైతే తప్పించాలని సవాల్ విసిరారు. టాటా మోటార్స్, టాటా కెమికిల్స్ కంపెనీల్లో కూడా నస్లీ డైరెక్టర్ గా ఉండటంతో, అక్కడి నుంచి కూడా ఉద్వాసన పలికేందుకు ఈ వారంలోనే సర్వసభ్య సమావేశాలు నిర్వహించాలని టాటా గ్రూప్ నిర్ణయించింది.

More Telugu News