: ఓ కలర్ జిరాక్స్, గ్లిట్టర్ పెన్... రూ. 2 వేల నోటు తయారు చేసిన బెంగళూరు బ్యాచ్... 8 చోట్ల చలామణి

కొత్తగా వచ్చిన రూ. 2 వేల కరెన్సీ నోటును పర్ఫెక్ట్ గా తయారు చేయడం ఎలా? తయారు చేస్తే దాన్ని ఎలా మార్చవచ్చు? ఈ ప్రశ్నలకు సమాధానం బెంగళూరుకు చెందిన శశాంక్, మధు కుమార్ లను అడిగి తెలుసుకోవాలేమో! కేవలం కలర్ జిరాక్స్ మిషన్, గ్లిట్టర్ పెన్ లను వినియోగించి రూ. 2 వేల ఫేక్ కరెన్సీని తయారు చేసిన వీరు ఎనిమిది షాపుల్లో వాటిని విజయవంతంగా మార్చుకున్నారు కూడా. నిన్న వీరు పోలీసులకు పట్టుబడగా, శుక్రవారం నుంచి వీరిదందా చేస్తున్నారని తేలింది.

ఈ స్నేహితులు ఇద్దరూ కలిసి జిరాక్స్ షాపులో రెండువేల నోటు జిరాక్స్ తీసి, దానిపై మెరుస్తూ ఉండే ఆకుపచ్చ ప్రాంతాన్ని గ్లిట్టర్ పెన్ తో దిద్దారు. ఆపై మద్యం షాపులకు వెళ్లి దర్జాగా నోట్లను మార్చడం మొదలు పెట్టారు. ఓ షాపు యజమానికి అనుమానం రావడంతో వీరి బాగోతం బయటపడింది. వీరికి కిరణ్ కుమార్, నాగరాజు అనే మరో ఇద్దరు సహకరించారని, మొత్తం 25 నోట్లను వీరు మార్చారని పోలీసులు తెలిపారు. తొలిసారి ఈ నోట్లు చూస్తే, దొంగ నోట్లన్న అనుమానం ఎంతమాత్రమూ రాని విధంగా ఉన్నాయని, సేఫ్టీ ఫీచర్లన్నీ గమనిస్తేనే దొంగ నోటని తేలుతుందని పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు.

More Telugu News