facebook: లైవ్‌ వీడియో తరహాలో లైవ్‌ ఆడియో.. ఫేస్‌బుక్‌లో మరో కొత్త ఆక‌ర్ష‌ణీయ‌ ఫీచర్‌

త‌మ ఖాతాదారుల‌ను ఆక‌ర్షించ‌డానికి ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త ఫీచ‌ర్‌ల‌ను తీసుకొస్తోన్న సోష‌ల్ మీడియా వెబ్‌సైట్‌ ఫేస్‌బుక్ తాజాగా మ‌రో ఫీచ‌ర్‌ను తీసుకురానుంది. ఇప్ప‌టికే ఫేస్‌బుక్‌లో లైవ్‌ వీడియో స‌దుపాయం ఉన్న విష‌యం తెలిసిందే. ఆ తరహాలోనే లైవ్‌ ఆడియో ఫీచర్‌ను తీసుకొస్తోంది. ఫేస్‌బుక్‌లో ఉన్న లైవ్‌వీడియో స్ట్రీమింగ్‌ సదుపాయాన్ని వినియోగించుకోవాలంటే అందుకోసం అధిక డేటా అవసరమవుతుంది. సిగ్నళ్లు స‌రిగా లేని ప్రాంతాల్లో అస్స‌లు ప‌నిచేయ‌ని ప‌రిస్థితి ఉంది. అటువంటి స‌మ‌స్య‌లు లైవ్ ఆడియోలో ఉండ‌వు. త‌క్కువ డేటా ఖ‌ర్చుతో మాత్ర‌మే కాకుండా సిగ్నళ్లు తక్కువగా ఉన్న ప్రాంతంలోనూ ఈ స‌దుపాయాన్ని వినియోగించుకోవ‌చ్చు.

తాము తీసుకురానున్న ఈ కొత్త ఫీచ‌ర్‌తో త‌మ యూజ‌ర్ల‌కు మరింత మెరుగైన సేవ‌లు అందుతాయ‌ని ఫేస్‌బుక్‌ పేర్కొంది. ఈ స‌దుపాయాన్ని తీసుకురావ‌డానికి ప్ర‌స్తుతం తాము భాగస్వామ్య బృందాలతో కృషి చేస్తున్నామ‌ని, ప‌లు ప‌రీక్ష‌లు జ‌రుపుతున్నామ‌ని చెప్పింది. వచ్చే ఏడాదికల్లా ఈ ఫీచ‌ర్‌ అందుబాటులోకి వ‌స్తుంద‌ని తెలిపింది.      

More Telugu News