: ఉరిశిక్షలు విధించారు సరే... ఉరికంబాలు ఏవి?... వింత సమస్య!

దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో ఇండియన్ ముజాహిదీన్ కు చెందిన ఐదుగురు ఉగ్రవాదులకు ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఉరిశిక్షను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. కోర్టు తీర్పును వెలువరించిన తరువాత... అసలైన సమస్య తెరపైకి వచ్చింది. వీరిని ఉరి తీయడానికి అవకాశమే లేకుండా ఉంది... ఎందుకంటే, ఉరికంబాలు లేవు కాబట్టి. తెలంగాణలోని రెండు సెంట్రల్ జైళ్లలో ఒక్క ఉరికంబం కూడా లేదు. హైదరాబాద్ లో ఉన్న చంచల్ గూడ, వరంగల్ లో ఉన్న సెంట్రల్ జైళ్లలో ఉరికంబాలు కావాలని ఇక్కడి జైళ్ల శాఖ గతంలోనే ప్రతిపాదనలు పంపింది. కానీ, ఇంత వరకు దానికి అనుమతులు రాలేదు. అయితే, ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి సెంట్రల్ జైల్లో మాత్రం ఒక ఉరికంబం ఉంది.

రాజమండ్రి సెంట్రల్ జైలు విషయానికి వస్తే... 1976 ఫిబ్రవరిలో చివరిసారిగా అక్కడ ఉరిశిక్షను అమలు చేశారు. అనంతపురం జిల్లాకు చెందిన నంబి కిష్టప్పను అప్పడు ఉరి తీశారు. అప్పటి నుంచి ఇంతవరకు అక్కడ కూడా ఉరిశిక్షలు అమలు కాలేదు. 1980లో ఉరికంబాన్ని జైల్లోనే బహిరంగ ప్రదేశానికి మార్చారు. కానీ, ఇంతవరకు ఎవరినీ ఉరి తీయలేదు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఇప్పటి వరకు 42 మందిని అక్కడ ఉరితీశారు.

ఇప్పుడు ఐదుగురు ఉగ్రవాదులకు ఉరిశిక్షను విధించడంతో... వారిని ఎక్కడ ఉరి తీయాలి? అనే ప్రశ్న ఉత్పన్నమైంది.

More Telugu News