: మానవత్వం లేదంటూ తెలంగాణ మంత్రిపై మండిపడుతున్న నెటిజన్లు

సోషల్ మీడియాలో తెలంగాణ మంత్రి అజ్మీర చందూలాల్ తీవ్ర విమర్శలపాలవుతున్న ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... తాడూరి మధుసూదనా చారి (30) అనే వ్యక్తి తన మిత్రులు గోపి, సతీష్‌ తో కలిసి రామయ్య ఆలయం దర్శించుకునేందుకు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా, జయశంకర్ భూపాల్‌పల్లి జిల్లాలో పాలంపేట్ గ్రామం నల్లకలువ క్రాస్‌ రోడ్స్‌ వద్ద వేగంగా వచ్చిన ట్రక్ వారి బైక్‌ ను ఢీకొట్టింది. వాహనాన్ని నడుపుతున్న చారి అక్కడికక్కడే మృతి చెందగా, అతని స్నేహితులు గాయాలతో బయటపడ్డారు. వారి వాహనాన్ని ఢీ కొట్టిన ట్రక్ ఆగకుండా, మరింత వేగంగా వెళ్లిపోయింది. దీంతో సంఘటనా స్థలికి చేరుకున్న స్థానికులు మృతదేహాన్ని, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించేందుకు వాహనం కోసం ఎదురుచూస్తుండగా, అదే రహదారిపై తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీర చందూలాల్ కాన్వాయ్ వచ్చింది.

రోడ్డుపక్కనే చారి మృతదేహం పడి ఉంది. క్షతగాత్రులు కూడా రోడ్డుపక్కనే ఉన్నారు. వారందర్నీ చూసుకుంటూ మంత్రి కాన్వాయ్ వెళ్లిపోయింది. దీనిని ఫోటో తీసిన స్థానికుడు 'మంత్రిగారి మానవత్వం' అంటూ సొంత నియోజకవర్గంలో చోటుచేసుకున్న ఘటన గురించి సోషల్ మీడియాలో ఫోటో పెట్టి సంఘటనను వివరించాడు. దీంతో నెటిజన్లు ఆయనపై మండిపడుతున్నారు. దీంతో స్పందించిన మంత్రి చందూలాల్ మాట్లాడుతూ, రోడ్డుపై ఒక వ్యక్తి శరీరాన్ని చూశానని అన్నారు. అయితే, తన బంధువు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడనే ఫోన్ రావడంతో, ఆదుర్దాగా వెళ్తున్నానని, వాస్తవానికి కారు దిగి బాధితులను పరామర్శించి ఉండాల్సిందని పేర్కొన్నారు. అయితే కంగారులో ఆ పని చేయలేకపోయానని అన్నారు. దీంతో శవాన్ని చూసికూడా పట్టించుకోకుండా వెళ్లడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. 

More Telugu News