: నోట్ల రద్దుపై ఆలోచిస్తుంటే తల బద్దలవుతోంది: చంద్రబాబు సంచలన వ్యాఖ్య

పెద్ద నోట్ల రద్దు తరువాత, ప్రజల అవస్థలు చూస్తుంటే తల బద్దలవుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. నవంబర్ తో పోలిస్తే, డిసెంబర్ లో కష్టాలు మరింతగా పెరిగాయన్న భావన ప్రజల్లో ఉందని, తక్షణం సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. విజయవాడలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో మనసువిప్పి మాట్లాడిన ఆయన, నోట్ల రద్దు స్వాగతించాల్సిన అంశమని చెబుతూనే, ప్రజలు అవస్థలు పడకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రంతో పాటు బ్యాంకర్లపైన కూడా ఉందని, వారు తమ పనిని నూరు శాతం సంతృప్తికరంగా చేస్తున్నట్టు కనిపించడం లేదని అన్నారు. నోట్ల రద్దు జరిగిపోయి నెలన్నర గడుస్తున్నా, ప్రజలింకా బ్యాంకుల్లో క్యూలైన్లలో నిలబడటం ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు.

తక్షణం సమస్యను పరిష్కరించే మార్గం కూడా తనకు కనిపించడం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆర్బీఐ నుంచి మరింతగా నగదు నిల్వలు బ్యాంకులకు రావాల్సివుందన్నారు.  ప్రజలకు చాలినంత చిల్లర ఇవ్వాల్సిన అవసరం ఉందని, ఈ మేరకు రూ. 500, రూ. 100 కొత్త నోట్లను ఇవ్వాలని ఇప్పటికే కోరామని ఆయన అన్నారు. నగదు రహిత లావాదేవీలకు ఏపీ ప్రభుత్వం పూర్తిగా మద్దతిస్తోందని, ఇప్పటికే ఈ-పోస్ యంత్రాలను విరివిగా సరఫరా చేశామని గుర్తు చేశారు.

More Telugu News